WCL 2025: సోషల్ మీడియాలో ట్రోలింగ్ దెబ్బకు.. ఇండియా- పాక్ మ్యాచ్ రద్దు..

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL 2025) టోర్నీలో భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది.

WCL 2025: సోషల్ మీడియాలో ట్రోలింగ్ దెబ్బకు.. ఇండియా- పాక్ మ్యాచ్ రద్దు..

WCL 2025

Updated On : July 20, 2025 / 11:42 AM IST

WCL 2025: వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్2025 (WCL 2025) టోర్నీలో భారత్ – పాకిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. బర్మింగ్‌హోమ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ మైదానంలో ఇవాళ (జులై 20న) ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు శనివారం రాత్రి నిర్వాహకులు ఒక ప్రకటనను విడుదల చేశారు. ఎవరూ ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం వద్దకు రావొద్దని సూచించారు. టికెట్ డబ్బును మొత్తం రీఫండ్ చేస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు.


ఇంగ్లాండ్ వేదికగా జరిగే ఈ టోర్నీలో యువరాజ్ సింగ్ నాయకత్వంలో టీమిండియా ఛాంపియన్స్ జట్టు బరిలోకి దిగింది. తొలి మ్యాచ్ పాకిస్థాన్ ఛాంపియన్స్‌తో కావడం గమనార్హం. అయితే, మ్యాచ్ తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇదేనా మీ దేశభక్తి అంటూ సోషల్ మీడియా వేదికగా భారత క్రికెటర్లపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

“హర్భజన్, యువరాజ్, ధావన్ వంటి భారత మాజీ క్రికెటర్లు సంతోషంగా WCL మ్యాచ్‌లను పాకిస్తాన్‌తో ప్రైవేట్ లీగ్‌లో ఆడుతున్నారు. అదే పబ్లిక్ మ్యాచ్ అనగానే.. వారు జాతీయవాదాన్ని తెరపైకి తెస్తారు. ఇదేమి ద్వంద్వ వైఖరి. ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? దేశభక్తి కేవలం సామాన్యులకేనా? సెలెబ్రిటీలకు కాదా? ఇది చాలా దారుణం” అంటూ ఓ నెటిజన్ ఫైర్ అయ్యాడు. ఇలా సోషల్ మీడియాలో భారత క్రికెటర్లపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదేనా మీ దేశ భక్తి అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేశారు. దీంతో ఈ మ్యాచ్ ఆడేందుకు భారత క్రికెటర్లు నిరాకరించడంతో మ్యాచ్‌ను నిర్వాహకులు రద్దు చేశారు.

 

సోషల్ మీడియాలో నెటిజన్ల విమర్శల నేపథ్యంలో శిఖర్ ధావన్ శనివారం రాత్రి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు పెట్టారు. ‘ఈ లీగ్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడకూడదని మే 11నే నిర్ణయం తీసుకున్నా. ఇప్పటికీ అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నా. నాకు నా దేశమే ముఖ్యం. దేశం కంటే ఏదీ ఎక్కువ కాదు. జై హింద్’ అంటూ మెయిల్ స్క్రీన్ షాట్‌లను ధావన్ పోస్టు చేశాడు. ధావన్ పోస్టు తరువాత కొద్దిసేపటికే ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు ప్రకటించారు.