తెలంగాణలో 6 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,044 కు చేరింది. కరోనా నుంచి కోలుకున్న 22 మంది ఈరోజు డిశ్చార్జ్ అయ్యారని ఆయన తెలిపారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో 463 మంది డిశ్చార్జ్ కాగా, 28 మంది కరోనా బారినపడి మరణించారని ఆయన వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 552 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 90 శాతం కేసులు మర్కజ్ కేసులేనని… 22 మందికి కరోనా ఎలా వచ్చిందో ట్రేస్ చేస్తున్నామని మంత్రి చెప్పారు.
రాష్ట్రంలో లక్ష మందికి కూడా వైద్యం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈటల చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 47 శాతం మంది కోలుకున్నారని, ప్రభుత్వ పనితీరును కేంద్రం అభినందించిందని మంత్రి గుర్తుచేశారు. టెస్ట్‌లు సరిగాచేయడం లేదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆయన తోచిపుచ్చారు.
కరోనా వైరస్ టెస్టులు చేయకపోవడం వల్లే తక్కువ కేసులు అనడం సరికాదన్నారు. ఎక్కడ పడితే అక్కడ టెస్టులు చేయొద్దని ఐసీఎంఆర్ చెప్పిందని ఈటల తెలిపారు. లాక్‌డౌన్ కఠినంగా అమలు చేయకుంటే తెలంగాణ మరో కర్నూలు అయి ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు.