ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా..సూత్రధారులు, పాత్రధారుల్లో టెన్షన్

  • Published By: naveen ,Published On : November 16, 2020 / 03:32 PM IST
ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా..సూత్రధారులు, పాత్రధారుల్లో టెన్షన్

Updated On : November 16, 2020 / 3:43 PM IST

cash for vote case: ఓటుకు నోటు కేసు విచారణ నవంబర్ 18కి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. కేసు విచారణకు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఉదయసింహా, సెబాస్టియన్ హాజరయ్యారు. ఏసీబీ కోర్టులో సెబాస్టియన్ డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. దానిపై విచారణ చేపట్టిన కోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18న చేపట్టనుంది.

స్టింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి:
ఓటుకు నోటు కేసు కుట్ర పూరితంగా జరిగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది ఏసీబీ. గండిపేటలో తెలుగుదేశం మహానాడు వేదికగా ఆ కుట్ర జరిగిందని తెలిపింది. నోవెటెల్ హోటల్‌లో రేవంత్‌రెడ్డి, సండ్ర, ఉదయసింహ సంప్రదింపులు జరిపారని.. వేం నరేందర్ రెడ్డి గెలుపు కోసం ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ ఓటును కొనేందుకు జరిగిన బేరసారాల ఆధారాలు తమ దగ్గరున్నాయని ఏసీబీ వివరించింది. స్టీఫెన్ సన్‌కు ఇవ్వజూపిన 50 లక్షలను ఉదయసింహకు నాగోల్ దగ్గర నరేందర్ రెడ్డి కుమారుడు అందజేసేలా.. రేవంత్ ఆదేశించినట్టు ఆధారాలు ఉన్నాయని తెలిపింది. ఆ తర్వాత స్టీఫెన్ సన్ నివాసంలో ఏసీబీ స్టింగ్ ఆపరేషన్‌లో రేవంత్‌రెడ్డి అడ్డంగా దొరికిపోయారు.

సూత్రధారులు, పాత్రధారుల్లో టెన్షన్:
స్టీఫెన్ సన్, రేవంత్ రెడ్డి ఫోన్ సంప్రదింపుల ఆడియో టేపులు సంచలనం కలిగించాయి. అయితే ఓటుకు నోటు కేసులో ఇప్పుడవే కీలకం కానున్నాయి. ఆడియో టేపులు, స్వర నమూనాలు ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్‌కు పంపించారు. ఆ రిపోర్టు ఇప్పుడు అభియోగాల నమోదులో కీలకం కానుంది. డిశ్చార్జ్ పిటిషన్‌పై విచారణ ప్రారంభించాలని ఏసీబీ కోర్టు ఇప్పటికే నిర్ణయించింది. ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా, సెబాస్టియన్ కచ్చితంగా హాజరు కావాలని స్పష్టం చేసింది. అభియోగాల నమోదుకు కోర్టు ట్రల్స్ ప్రారంభించడం, కుట్రకు సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నాయని ఏసీబీ ఇప్పటికే కోర్టుకు తెలపటంతో.. ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారుల్లో టెన్షన్ మొదలైంది.