అందెశ్రీ కొడుక్కి జాబ్ కన్ ఫాం.. శాసనమండలిలో బిల్ పాస్.. ఏం ఉద్యోగం అంటే..
Telangana Govt : అందెశ్రీ కుమారుడు దత్తసాయిని ఉన్నత విద్యాశాఖ పరిధిలోని డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును శాసనమండలి పాస్ చేసింది.
Andesri
- ఇచ్చినమాట నిలబెట్టుకున్న తెలంగాణ సర్కార్
- అందెశ్రీ కుమారుడికి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం
- శాసనమండలిలో బిల్ పాస్
Telangana Govt : ‘జయ జయహే తెలంగాణ’ గీతంతో రాష్ట్ర ప్రజలను ఏకం చేయడంలో ప్రముఖపాత్ర పోషించిన ప్రజాకవి అందెశ్రీ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అందెశ్రీ పార్ధివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అంత్యక్రియల్లో పాల్గొని అందెశ్రీ పాడె మోశారు. అందెశ్రీ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
అయితే, తాజాగా.. అందెశ్రీ కుమారుడు దత్తసాయిని ఉన్నత విద్యాశాఖ పరిధిలోని డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమించింది. దత్తసాయికి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును శాసనమండలి పాస్ చేసింది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతుతూ.. రాష్ట్ర ప్రజలను ఏకం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన అందెశ్రీ సేవలను ప్రభుత్వం గుర్తించిందని అన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ’ గీతం రాష్ట్ర ప్రజలను ఏకం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిందని, ఈ గీతాన్ని ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ప్రకటించిందని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. మానవత్వంతో ఈ ప్రభుత్వం అందెశ్రీ కుటుంబాన్ని ఆదుకోవడం బాధ్యతగా భావించిందని, అందులో భాగంగా అందెశ్రీ కుమారుడు దత్త సాయిని ఉన్నత విద్యాశాఖ పరిధిలోని డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియమించినట్లు పేర్కొన్నారు.
అందెశ్రీగా పిలవబడే అందె ఎల్లయ్య సిద్దిపేట జిల్లా రేపర్తి గ్రామంలో జన్మించారు. అనాథ అయిన అందెశ్రీ.. గీత రచయితగా ఎదిగారు. ఎలాంటి సాధికారత విద్య లేకున్నా తెలంగాణ గ్రామీణ, అణగారిన వర్గాలను ప్రతిబింబించేలా 3వేల కవితలను అందెశ్రీ రచించారు.
