TS SSC leak Case: నా ఫోన్ కాల్ లిస్టు చూసి సీఎం కేసీఆర్ భయపడ్డారు.. ఎందుకో తెలుసా?: బండి సంజయ్
తన ఫోనులో ఏ సమాచారం ఉందో బండి సంజయ్ వివరించారు. ఇప్పటికే తన ఫోన్ కాల్ లిస్టును సీఎం కేసీఆర్ చూశారని ఆయన అంటున్నారు.

Bandi Sanjay
TS SSC leak Case: తెలంగాణలో టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు(TS SSC leak Case)లో తనకు దక్కిన బెయిల్ ను రద్దు చేయాలని ప్రభుత్వం వాదిస్తోందని, ఎందుకు రద్దు చేయాలో చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) డిమాండ్ చేశారు. తన ఫోన్ ను ఎవరు ఎత్తికెళ్లారని నిలదీశారు. వరంగల్ సీపీ రంగనాథ్ తన ఫోన్ కాల్ లిస్టు బయటపెట్టాలని అన్నారు. తన ఫోన్ కాల్ లిస్టు చూసి ముఖ్యమంత్రి భయపడ్డారని బండి సంజయ్ చెప్పారు. చాలా మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని తెలుసుకుని సీఎం షాక్ అయ్యారని తెలిపారు.
“నా ఫోన్ లో ఏముంది? సాయంత్రం 5 గంటలకు నా వాట్సాప్ లో పేపర్ చూశారని చెప్పారు. సాయంత్రం 5 గంటలకు పేపర్ ఎవరికి పంపించాలి? వరంగల్ సీపీ అంతుచూస్తా. విజయవాడ, నల్లగొండ జిల్లాల్లో సీపీ ఏం చేశాడో అన్ని బయటపెడతా. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవని ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ లో బిడ్డింగ్ ఎలా చేస్తుంది? సింగరేణిలో 27 వేల కోట్ల రూపాయలు దారి మళ్లించారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి సహకరించడం లేదన్న మంత్రులు కంటివెలుగులో ఆపరేషన్ చేయించుకోవాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, పరీక్షల్లో ఎలాంటి స్కాములు లేవు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభోత్సవం అభివృద్ధి కాదా? రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సీఎం ఎందుకు రాలేదు? ఈ నెల 15న వరంగల్ లో వేలాది మందితో నిరుద్యోగ మార్చ్ ఉంటుంది. తెలంగాణ సంపదను ముఖ్యమంత్రి కేసీఆర్ దోచుకున్నారు” అని బండి సంజయ్ అన్నారు.
కాగా, టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు(TS SSC leak Case)లో బండి సంజయ్ అరెస్టు కాగా, ఆయనకు కోర్టులో బెయిల్ లభించిన విషయం తెలిసిందే. తన ఫోన్ మిస్ అయిందని బండి సంజయ్ చెబుతున్నారు. టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఇవాళ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను కూడా పోలీసులు విచారించారు. ఆ సమయంలో ఈటల రాజేందర్ తన ఫోనును కూడా తీసుకెళ్లారు.
TS SSC leak Case: తెలంగాణ హైకోర్టులో విచారణ.. బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలని కోరిన ఏజీ