Bandi Sanjay: ఈ పేరు పెడితే కేంద్ర సర్కారు ఒక్క ఇల్లు కూడా ఇవ్వదు: బండి సంజయ్
రేషన్ కార్డులపై కాంగ్రెస్ నేతల ఫొటోలు పెడితే ఈ కార్డులను కూడా ఇవ్వబోమని చెప్పారు.

Revanth Reddy, Bandi Sanjay
ఇందిరమ్మ ఇళ్ల కోసం తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తున్న వేళ దీనిపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం ఒక్క ఇల్లు కూడా ఇవ్వదని స్పష్టం చేశారు. ఫొటోలు మార్చితే కేంద్ర ప్రభుత్వం ఊరుకోదని చెప్పారు.
“ప్రధాన మంత్రి ఆవాస్ యోజన” పేరు పెడితేనే నిధులిస్తామని బండి సంజయ్ అన్నారు. రేషన్ కార్డులపై కాంగ్రెస్ నేతల ఫొటోలు పెడితే ఈ కార్డులను కూడా ఇవ్వబోమని చెప్పారు. తామే ముద్రించి ప్రజలకు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డికి గురువు కేసీఆర్ అని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు అవినీతి పార్టీలేనని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ కప్పం కట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కేసును మరుగున పెట్టారని బండి సంజయ్ తెలిపారు. ఈ కార్ ఫార్ములా అక్రమాలపై ఆధారాలు ఉన్నాయంటున్న ప్రభుత్వం కేటీఆర్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. గ్రీన్ కో సంస్థ నుంచి కాంగ్రెస్ కు ముడుపులు ముట్టాయని ఆరోపించారు. గ్రీన్ కో సంస్థ నుంచి డబ్బులు ముట్టాయా? లేదా? చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నానని అన్నారు.
దావోస్ పెట్టుబడులపై శ్వేత పత్రం విడుదల చేయాలని చెప్పారు. ఈ కార్ రేస్ ఫార్ములా నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే దావోస్ పెట్టుబడులను తెరపైకి తెచ్చారని అన్నారు. నిధులు ఇచ్చేది అభివృద్ధి చేసేది కేంద్ర ప్రభుత్వమేనని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో లక్షా 40 వేల కోట్ల రూపాయల అప్పు చేసిందని చెప్పారు. 30 వేల కోట్ల రూపాయల మిత్తి చెల్లిస్తున్నారని తెలిపారు.
కేంద్ర సర్కారు స్మార్ట్ సిటీకి నిధులు ఇస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని దారి మళ్లించిందని ఆరోపించారు. తాను వార్నింగ్ ఇవ్వడంతో కేసీఆర్ నిధులు విడుదల చేశారని చెప్పారు. కాగా, మేయర్ సునీల్ రావు బీజేపిలో చేరికతో కరీంనగర్ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగరవేస్తామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.
Vijaysai Reddy: రాజీనామా చేస్తానంటే జగన్ ఒకే ఒక మాటన్నారు: విజయసాయిరెడ్డి