రాష్ట్ర భవిష్యత్ కేసీఆర్ చేతిలోనే భద్రం, టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ నేత రావుల శ్రీధర్ రెడ్డి

ravula sridhar reddy joins trs: తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి వలసలు సాగుతున్నాయి. మరో బీజేపీ సీనియర్ నేత టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీజేపీ నేత రావుల శ్రీధర్ రెడ్డి గులాబీ పార్టీలో చేరారు. శ్రీధర్ రెడ్డికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన శ్రీధర్ రెడ్డితో పాటు వందలాది మంది బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
దేశంలో తెలంగాణ అగ్రగామిగా నిలవాలంటే కేసీఆర్ నాయకత్వం తప్పనిసరి:
టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా రావుల శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ సీఎం కేసీఆర్ చేతిలోనే భద్రంగా ఉంటుందని స్పష్టం చేశారు. గత 11 సంవత్సరాల నుంచి బీజేపీలో వివిధ స్థాయిల్లో ప్రజలకు సేవలందించానని, జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశానని, రెండేళ్ల నుంచి ప్రజల మధ్య ఉంటున్నానని ఆయన తెలిపారు.
ఇవాళ దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను పరిశీలించాక టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్టు వివరించారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణతో పాటు హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్ర భవిష్యత్ కేసీఆర్ చేతిలోనే భద్రంగా ఉంటుందన్నారు. దేశంలో అగ్రగామిగా నిలవాలంటే కేసీఆర్ నాయకత్వం తప్పనిసరి అని రావుల శ్రీధర్ రెడ్డి తెలిపారు.
దుబ్బాక, జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ గెలుపు ఖాయం:
దుబ్బాక చైతన్యవంతమైన ప్రజాక్షేత్రం అన్న రావుల, ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని చెప్పారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గత ఫలితం పునరావృతం కాబోతుందన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో తనకున్న అనుభవాన్ని, శక్తియుక్తులను టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి ఉపయోగిస్తానని చెప్పారు.
https://10tv.in/goodbye-to-congress-vijayashanthi-may-join-in-bjp/
తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందన్నారు. ఇది ప్రతి పార్టీ నాయకుడు గుర్తుంచుకోవాలన్నారు. కరోనా సమయంలోనూ ప్రతి వ్యక్తిని, కుటుంబాన్ని కేసీఆర్ దేవుడిలా ఆదుకున్నారని రావుల అన్నారు. ఇటీవల వచ్చిన వరదలకు ప్రభావితమైన కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారని చెప్పారు. ఇరిగేషన్, విద్యుత్, ఐటీ రంగంలో తెలంగాణ మందంజలో ఉందన్నారు రావుల శ్రీధర్ రెడ్డి.
తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS గారి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన బీజేపీ సీనియర్ నాయకుడు శ్రీ రావుల శ్రీధర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ @YadavTalasani, శ్రీ @VSrinivasGoud… pic.twitter.com/g12c1YkNjz
— TRS Party (@trspartyonline) November 2, 2020