చంద్రబాబుకి నిద్ర లేకుండా చేస్తున్న బీజేపీ, గ్రేటర్‌లో కమలం ఆపరేషన్ ఆకర్ష్

bjp operation akarsh ghmc: ఎన్నికలొస్తున్నాయంటే రాజకీయ పార్టీలకు పండగే. ముఖ్యంగా తమ సత్తా నిరూపించుకోవాలని ఆశించే పార్టీలకైతే సంబరమే. ఇప్పుడు తెలంగాణలో అదే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో బలాన్ని పెంచుకోవాలని భావిస్తున్న బీజేపీకి దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం మాంచి ఊపునిచ్చింది. అంతే ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా గ్రేటర్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. మేయర్ పీఠమే లక్ష్యంగా వ్యూహాలు రచించే పనుల్లో పార్టీ నేతలు బిజీ అవుతున్నారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు గ్రేటర్ ఎన్నికలపై కన్నేశాయి. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు నుంచే ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి.
ప్రచారంలో బండి దూకుడు:
బీజేపీ అడుగులు వడివడిగా వేస్తోంది. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గాల వారిగా కిషన్ రెడ్డి బల్దియాలో అప్పుడే రెండు సన్నాహక సమావేశాలు పూర్తిచేశారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్‌లోని అసంతృప్తి నేతలతో పాటు టీడీపీలో మిగిలున్న వారిని బీజేపీలోకి ఆహ్వానించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని అంటున్నారు. ఇప్పటికే అనేక మంది నేతలతో టచ్‌లోకి వెళ్లిన బీజేపీ నేతలు.. మరింత మందిని తమ పార్టీలో చేర్చుకునేందుకు ఒప్పించినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది.
తెరవెనుక గరికపాటి, టీడీపీ లీడర్లే టార్గెట్:
ఆపరేషన్ ఆకర్ష్‌లో తెర ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణలు ఉండగా.. తెరవెనక మాజీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు ఉన్నట్టు పార్టీలో చర్చ నడుస్తోంది. టీడీపీలో పని చేసిన లీడర్లే టార్గెట్‌గా ఆయన ఆపరేషన్ మొదలు పెట్టినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీలో ఉన్న నేతలతో పాటు టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన నేతలను ఆయన టార్గెట్ చేసి మంతనాలు చేస్తున్నట్టు చెబుతున్నారు.
https://10tv.in/arrest-me-bandi-sanjay-challenge-trs/
అప్పుడు తుమ్మల, ఇప్పుడు గరికపాటి:
గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు గులాబీ దళం వైపు వర్కవుట్ చేయగా.. ఈసారి కాషాయం పార్టీ వైపు గరికపాటి అదే పని చేస్తున్నారని పార్టీ వర్గాలో టాక్ నడుస్తోంది. ఇప్పటికే బేగంపేట డివిజన్ టీడీపీ నేత గంగాధర్ గౌడ్ బీజేపీలో చేరగా …. టీఆర్ఎస్ అసంతృప్త నేతలను కూడా పార్టీలో చేర్చుకునేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. కంటోన్మెంట్ టీఆర్ఎస్ అసంతృప్తి నేత, వైస్ చైర్మన్ రామకృష్ణ బీజేపీ తీర్థం పుచ్చుకోవడంలో గరికపాటి కీలకపాత్ర పోషించారన్న చర్చ సాగుతోంది.
గత గ్రేటర్ ఎన్నికల్లో అతి స్వల్ప తేడాలో ఓడిపోయిన నేతలపై బీజేపీ దృష్టి:
గత గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసి అతి స్వల్ప తేడాలో ఓడిపోయిన నేతలపై బీజేపీ దృష్టి సారించినట్టు సమాచారం. వారిని పార్టీలోకి చేర్పించే బాధ్యత గరికపాటికి అప్పగించినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. గత జీహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందు గ్రేటర్‌లో టీడీపీకి బలమైన కేడర్ ఉండేది. ప్రస్తుతం టీడీపీకి పెద్దగా ఆదరణ లేకపోయినా ఆ పార్టీ నేతలు మాత్రం ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. దీంతో వారిని పార్టీలో చేర్చుకుంటే బీజేపీకి బలం పెరగడం ఖాయం అంటోంది గరికపాటి వర్గం.
గరికపాటి సీక్రెట్ ఆపరేషన్:
గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్ఎస్ నెగిటివ్ ఓటు గంపగుత్తగా బీజేపీ వైపు తిప్పుకోవడం కోసం గరికపాటి సీక్రెట్ ఆపరేషన్‌కు సానుకూల స్పందన వస్తుండటంతో ఖుషీఖుషీగా ఉంది కాషాయ దళం. గ్రేటర్ ఎన్నికల కోసం ద్విముఖ వ్యూహంతో వెళ్తున్న బీజేపీకి ఈ ప్లాన్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో వేచిచూడాలి.