దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయండి: స్పీకర్‌ను కోరిన బీఆర్ఎస్

బీఆర్ఎస్ నాయకులు ఎట్టకేలకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని కోరారు.

దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయండి: స్పీకర్‌ను కోరిన బీఆర్ఎస్

BRS demands disqualification of Danam Nagender

Updated On : March 18, 2024 / 12:55 PM IST

Danam Nagender: పార్టీ ఫిరాయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎమ్మెల్యేలు సోమవారం శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిసి విన్నవించారు. ఎమ్మెల్యే క్వాటర్స్‌లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, ముఠా గోపాల్, బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్ కలిశారు. తమ పార్టీ సింబల్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని కోరారు. కాగా, లీగల్ టీమ్‌ని సంప్రదించి నిర్ణయం తీసుకుంటానని వారితో స్పీకర్ చెప్పినట్లు సమాచారం.

కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున దానం నాగేందర్‌ గెలిచిన సంగతి తెలిసిందే. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు దానం నాగేందర్ ఆదివారం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో స్పీకర్‌ను కలిసి దానం నాగేందర్‌పై ఫిర్యాదు చేసేందుకు నిన్న బీఆర్ఎస్ నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఈరోజు స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

Also Read: తెలంగాణ గవర్నర్ తమిళసై రాజీనామా.. కారణం అదేనా?

త్వరలో జరగనున్న లోక్‌స‌భ‌ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి దానం నాగేందర్‌ పోటీచేస్తారని ప్రచారం జరుగుతుంది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి పోటీ చేయనున్నట్లు సమాచారం.