అందుకే అభిషేక్ మను సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపిస్తున్నాం- సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

రైతు కృతజ్ఞత సభ, రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంపై త్వరలో ఢిల్లీ పెద్దలతో మాట్లాడి త్వరలో తేదీ వెల్లడిస్తాము.

అందుకే అభిషేక్ మను సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపిస్తున్నాం- సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Updated On : August 18, 2024 / 11:19 PM IST

Cm Revanth Reddy : పునర్ విభజన చట్టంలోని అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించాల్సిన అవసరం ఉందని, అందుకే అభిషేక్ మను సింఘ్వీని రాజ్యసభకు పంపించాలని అధిష్టానాన్ని కోరామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సీఎల్పీ సమావేశంలో సభ్యులకు ఈ విషయాన్ని చెప్పారు సీఎం రేవంత్. తెలంగాణ నుంచి సింఘ్వీని ప్రతిపాదించిన వెంటనే ఆమోదించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర పునర్ విభజన చట్టం అమల్లో రాజ్యాంగ, న్యాయపరమైన చిక్కులు ఉత్పన్నమయ్యాయని సీఎం రేవంత్ చెప్పారు.

పదేళ్లుగా కేంద్రం ఈ చట్టాన్ని అమలు చేయాలన్నారు. దీనిపై నిలదీసేందుకే సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు నామినేట్ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ వివరించారు. అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం న్యాయస్థానాల్లో సింఘ్వీ గట్టిగా వాదిస్తారని చెప్పారు. మాజీ ఎంపీ కేకే పెద్ద మనసుతో క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా వ్యవహరించారని సీఎం రేవంత్ ప్రశంసించారు. సింఘ్వీ రేపు నామినేషన్ వేస్తారని సీఎం రేవంత్ తెలిపారు.

”తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ ఉపఎన్నికల అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీని నిర్ణయించాం. వారి నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇవాళ సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్ సభ ఎంపీలను, రాజ్యసభ ఎంపీలను సమావేశానికి ఆహ్వానించి అభిషేక్ మను సింఘ్వీని పరిచయం చేశాం. రేపు ఉదయం సరిగ్గా 11 గంటలకు సింఘ్వీ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరుపున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా.

ఏపీ పునర్ విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి ఆ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ నేతృత్వంలో చాలా అంశాలను చట్టబద్దంగా మనకు హక్కులను కల్పించారు. ఖమ్మంలో ఉక్కు కర్మాగారం, వరంగల్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం, సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు.. ఇవన్నీ చట్టసభల్లోనే కాకుండా న్యాయస్థానాల్లో కూడా మన పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకే రాజ్యాంగ నిపుణులు, న్యాయకోవిదుడు అభిషేక్ మను సింఘ్వీ తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్తే మన రాష్ట్ర సమస్యలపై చట్టసభలతో పాటు న్యాయస్థానాల్లో కూడా పోరాటం చేసేందుకు అవకాశం ఉంటుంది. అందుకే వారిని రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించడం తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడటానికి, మన హక్కులు సాధించుకోవడానికి ఉపయోగపడుతుందని, మనస్ఫూర్తిగా వారిని తెలంగాణ తరుపున రాజ్యసభకు ఆహ్వానిస్తున్నాం” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

ఏఐసీసీ ఆదేశాల మేరకు అభిషేక్ సింఘ్విని రాజ్యసభ అభ్యర్థిగా నిర్ణయిస్తూ తీర్మానం చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్ సభ, రాజ్యసభ ఎంపీలో సీఎల్పీ సమావేశం జరిగిందన్నారు. రేపు(ఆగస్టు 19) ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో అభిషేక్ సింఘ్వి నామినేషన్ వేస్తారని రేవంత్ వెల్లడించారు. అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి వస్తారని, నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన తెలిపారు.

”విభజన హామీల్లో మనకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చట్టబద్దత కల్పించారు. కానీ, అవేవీ అమలు కాలేదు. వాటిపై చట్ట సభలలో, కోర్టులలో కూడా అభిషేక్ సింఘ్వి మాట్లాడతారు. రైతు కృతజ్ఞత సభ తొందరలోనే ఉంటుంది. రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ డేట్లు వీలు కాలేదు. రైతు కృతజ్ఞత సభ, రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంపై త్వరలో ఢిల్లీ పెద్దలతో మాట్లాడి త్వరలో తేదీ వెల్లడిస్తాము” అని రేవంత్ రెడ్డి తెలిపారు.

అభిషేక్ సింఘ్వి- రాజ్యసభ అభ్యర్థి
‘నన్ను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించినందుకు ఎఐసిసి పెద్దలకు కృతజ్ఞతలు. మర్యాద పూర్వకంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, ఎంపీలను కలిశా. రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో నేను మాట్లాడుతూనే ఉంటాను”.

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశమైంది. నానక్ రామ్ గూడలోని హోటల్ షెరటాన్ వేదికగా ఈ సమావేశం జరిగింది. రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్విని పార్టీ నేతలకు పరిచయం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ భేటీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై సీఎల్పీ భేటీలో చర్చించారు.

Also Read : మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ