Cm Revanth Reddy: దేశానికి దిక్సూచిలా తెలంగాణ కులగణన సర్వే.. ఢిల్లీలో సీఎం రేవంత్ పవర్ పాయింట్ ప్రజంటేషన్
ఈ విషయంలో విపక్ష నేతలను కూడా కలుపుకుని పోయేలా కార్యాచరణ రూపొందించుకున్నారు.

Cm Revanth Reddy: తెలంగాణ కులగణన సర్వేపై దేశ రాజధాని ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తున్నారు. తెలంగాణ కులగణన తీరును కాంగ్రెస్ ఎంపీలకు వివరిస్తున్నారు. త్వరలో కేంద్రం దేశవ్యాప్త జనగణన జరపనుండగా తెలంగాణలో చేసిన బీసీ కులగణన సర్వే తీరును కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంతో పాటు తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను కేంద్రం ఆమోదించేలా ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ ఎంపీలను రేవంత్ రెడ్డి కోరనున్నారు. ఈ విషయంలో విపక్ష నేతలను కూడా కలుపుకుని పోయేలా కార్యాచరణ రూపొందించుకున్నారు.
Also Read: మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు.. భారీగా డబ్బులు వసూలు చేసినట్లుగా ఆరోపణలు..
ఇందిరాభవన్ లో బీసీ కులగణనపై కాంగ్రెస్ ఎంపీలకు ప్రజంటేషన్ ఇచ్చారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ ప్రజంటేషన్ కు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. తెలంగాణ కులగణన సర్వే దేశానికే ఆదర్శం అని భట్టి అన్నారు. ఎన్నికల ప్రచారంలో కులగణన చేపడతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని భట్టి గుర్తు చేశారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ కులగణన చేశామన్నారు. కులగణన సర్వే రిపోర్టును క్యాబినెట్ ఆమోదించిందని ఆయన తెలిపారు. ఈ సర్వేలో 2లక్షల మంది సిబ్బంది పాల్గొన్నారని చెప్పారు.
”ప్రధాని మోదీ పుట్టుకతో ఓబీసీ కాదు. లీగల్లీ కన్వర్టడ్ ఓబీసీ. అధికారంలోకి వచ్చిన తర్వాత తన కులాన్ని మోదీ ఓబీసీ క్యాటగిరిలోకి తెచ్చారు. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే 16 పార్టీలు మద్దతిచ్చాయి. ఖర్గే, రాహుల్ గాంధీల డైరెక్షన్ లో కులగణన చేశాం. తెలంగాణ సర్వేతో మోదీకి కాంగ్రెస్ సవాల్ విసరగలిగింది. స్వతంత్ర భారత దేశంలో కులగణన జరగలేదు. దేశానికి దిక్సూచిలా తెలంగాణలో సర్వే చేశాం. కులగణనకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టేందుకు సర్వే చేశాం. ఒక్క ఏడాదిలోనే సర్వే పూర్తి చేసి అసెంబ్లీలో పెట్టగలిగాం” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.