అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌గా సీపీ సజ్జనార్

CP Sajjanar as Additional District Magistrate : సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ అదనపు మేజిస్ట్రేట్ హోదాలో శనివారం కోర్టును నిర్వహించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలిలోని పోలీసు కమిషనర్ కార్యాలయంలో కోర్టు హాల్‌ను ప్రారంభించారు. అనంతరం అదనపు జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో 110 సీఆర్‌పీసీ ప్రొసీడింగ్స్‌ను నిర్వహించారు. ఈ నేపథ్యంలో వివిధ కేసుల్లో నిందితులుగా ఉండి, జైలు నుంచి బయటికి వచ్చిన దాదాపు 8 కేసుల్లో 11 మందిని విచారించారు. వారికి ఒక్కొక్కరికి రూ.25 వేల జరిమానా విధించి… ఏడాదిపాటు బైండోవర్‌ను విధించారు.
అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌గా సీపీ సజ్జనార్ ముందు.. నిందితులు కుమ్మరి కృష్ణయ్య, పిట్టల మల్లేశ్, కెతావత్ గోపాల్, రమావత్ వినోద్, బానోత్ సంతోశ్, సాయికిరణ్‌రెడ్డి, కొమ్మని శ్రీనివాస్, సోనూ సింగ్, సయ్యద్ అక్రమ్, సాదత్ ఖాన్‌లు హాజరయ్యారు. వీరంతా ఏడాదిలోపు ఏదైనా నేరం చేసినా, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా.. వారి ష్యూరిటీ నగదును జప్తు చేయడంతోపాటు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కోర్టును ప్రతి సోమ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్నట్లు సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. సైబరాబాద్ మెట్రోపాలిటన్ పోలీసు యాక్ట్-2004 అందించిన అధికారంతో తాను అడిషనల్ డిస్ట్రిక్ మేజిస్ట్రేట్ హోదాలో ఈ కోర్టును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కోర్టు ప్రారంభోత్సవంలో డీసీపీ క్రైమ్స్ రోహిణి ప్రియదర్శిని, రిటైర్డ్ అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి, న్యాయ సలహాదారులు బాల బుచ్చయ్య, రేవారెడ్డి, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్‌లు పాల్గొన్నారు.