తెలంగాణలో తగ్గుతున్న కరోనా, 1,500 పైగా కంటైన్మెంట్ జోన్లు..వ్యూహం ఫలిస్తోంది

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 1,500 పైగా కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి…ప్రభుత్వం చేసిన వ్యూహం ఫలిస్తోంది. టెస్టులు పెరగడంతో పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. కేసులు క్రమంగా తగ్గుతుండడంతో కంటోన్మెంట్ జోన్ల సంఖ్యను తగ్గిస్తున్నారు.
జులై 30వ తేదీన మొత్తం 92 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. అయితే..ప్రస్తుతం హైదరాబాద్‌లో 64 జోన్లు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయి. GHMCలో కేసులు ఎక్కువవుతున్న ప్రాంతాల్లో జోన్లను పెంచారు. ఎల్బీనగర్, చార్మినార్, ఖైరతాబాద్ వంటి ప్రాంతాల్లో ఒకప్పుడు వందల్లో నమోదైన కేసులు ప్రస్తుతం తగ్గుముఖం పడుతుండటంతో నగరవాసులు ఊపిరిపీల్చుకుంటున్నారు.
జిల్లాల్లోనూ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో సున్నా కేసులు నమోదవుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లిలో రెండు రోజుల నుంచి ఎలాంటి ఒక్క కేసు కూడా రికార్డు కాకపోవడం గమనార్హం. నారాయణపేట, నిర్మల్ జిల్లాల్లోనూ ఆదివారం కొత్త కేసులు నమోదు కాలేదు.
భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, కామారెడ్డి, ములుగు, మెదక్, రాజన్న సిరిసిల్ల, వనపర్తి, వికారాబాద్, యాద్రాది భువనగిరి జిల్లాల్లో పదిలోపే కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 7.53 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 92,255 మందికి పాజిటివ్ అని తేలింది.
జీహెచ్‌ఎంసీ పరిధిలో 64 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి అధికారులు పరీక్షిస్తున్నారు. మిగతా అన్ని జిల్లాల్లో మొత్తం 1,569 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నది. పాజిటివ్ కేసుల నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటుండటంతో కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది..