వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు

అవినీతికి తావు లేకుండా, పారదర్శకంగా ఉండే విధంగా వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు జరగాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఏ అధికారికి విచక్షణాధికారం ఉండకూడదని సూచించారు

వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు

Establishment Of Cabinet Sub Committee On Registration Of Non Agricultural Assets And Lands

Updated On : December 6, 2021 / 1:40 PM IST

Establishment of Cabinet Sub-Committee on Registration of Non-Agricultural Assets and Lands : అవినీతికి తావు లేకుండా, పారదర్శకంగా ఉండే విధంగా వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు జరగాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఏ అధికారికి విచక్షణాధికారం ఉండకూడదని సూచించారు. దీనికి అవసరమైన విధి విధానాలు, మార్గదర్శకాలు ఖరారు చేయాలన్నారు. వ్యవసాయేతర ఆస్తులు, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి అనుసరించాల్సిన పద్ధతులపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని ప్రగతిభవన్‌ చేరుకున్న తర్వాత డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్‌, సీఎంవో కార్యదర్శులు, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ నవీన్‌రావు పాల్గొన్నారు.

ధరణి పోర్టల్ ద్వారా జరుగుతున్న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లపై అధికారులను అడిగి సిఎం కేసీఆర్ వివరాలు తెలుసుకున్నారు. చిన్న చిన్న సమస్యలను అధిగమిస్తూ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చాలా బాగా జరుగుతోందని, రైతులు చాలా సులభంగా, సంతోషంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయేతర భూముల విషయంలో కూడా అలాంటి విధానమే రావాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

వ్యవసాయేతర ఆస్తులు వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కోసం అవలంభించాల్సిన పద్ధతులపై అన్ని వర్గాలతో మాట్లాడి, అవసరమైన సూచనలు ఇవ్వడం కోసం ఆర్ అండ్ బి, గృహ నిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ ఉపసంఘాన్ని సీఎం కేసీఆర్ నియమించారు. ఈ కమిటీలో హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్ సభ్యులుగా ఉంటారు.

మూడు నాలుగు రోజుల పాటు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వర్గాలతో సమావేశమైన, వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని మంత్రి వర్గ ఉపసంఘాన్ని కేసీఆర్ ఆదేశించారు.

వివిధ కారణాల వల్ల 70 నుంచి 80 రోజుల నుంచి రిజిస్ట్రేషన్లు ఆగిపోయి ఇబ్బందులు తలెత్తాయి.. ఇంకా జాప్యం కావద్దని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అన్ని సమస్యలు తొలగిపోయి సులభంగా, సౌకర్యవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకునే విధానం రావాలన్నారాయ. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా వైభవంగా సాగుతోందని.. దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, మరింత మెరుగ్గా సాగడానికి వీలుగా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉండాలి.

ప్రజలకు లేనిపోని కొత్త ఇబ్బందులు రావద్దు. ప్రజలు ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి రావద్దు. ఏ అధికారి కూడా తన విచక్షణను ఉపయోగించి నిర్ణయాలు తీసుకునే వీలు ఉండవద్దు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు, ఇతర వర్గాలను సంప్రదించి, వారి అభిప్రాయాలు తీసుకుని మంచి విధానం తీసుకురావాలి. మంత్రి వర్గ ఉపసంఘం అందరితో చర్చించాలి.

నగరాలు, పట్టణాల్లో ఎలాంటి సమస్యలున్నాయి? గ్రామాల్లో ఎలాంటి పరిస్థితి ఉంది? ప్రస్తుతం ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? వాటిని ఎలా పరిష్కరించాలి? ఇంకా మెరుగైన విధానం తీసుకురావాలంటే ఏమి చేయాలి? తదితర అంశాలపై కూలంకషంగా చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి ” అని ముఖ్యమంత్రి కోరారు.

పేదలు సరైన డాక్యుమెంట్లు లేకుండానే ఇండ్లు నిర్మించుకున్నారు. వారికి కరెంటు బిల్లు, ఇంటి పన్ను, నీటి బిల్లులు వస్తున్నాయి. అలాంటి ఆస్తులను అమ్మే, కొనే సందర్భంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వాటిని పరిష్కరించడానికి కూడా మార్గం కనిపెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.