కాంగ్రెస్ పార్టీలోకి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి?

లోక్ సభ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీలోకి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీలోకి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి?

GHMC Mayor Vijaya Lakshmi

Updated On : March 22, 2024 / 3:26 PM IST

GHMC Mayor Vijaya Lakshmi : లోక్ సభ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీలోకి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లాల్లో పార్టీ కీలక నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగలబోతున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం విజయలక్ష్మీతో ఆమె నివాసంలో కాంగ్రెస్ ఇంచార్జి దీపాదాస్ మున్షీ, ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిణ్ రెడ్డిలు సమావేశం అయ్యారు. కాంగ్రెస్ లోకి రావాలని దీపదాస్ మున్షీ గద్వాల విజయలక్ష్మీని ఆహ్వానించారు. కార్యకర్తలతో చర్చించిన తరువాత నిర్ణయం చెబుతానని, రెండు సార్లు నన్ను గెలిపించిన కార్యకర్తలకు చెప్పకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోనని, వారి అభిప్రాయం మేరకే తన నిర్ణయం ఉంటుందని విజయలక్ష్మీ చెప్పినట్లు సమాచారం.

Also Read : టీడీపీ మూడో జాబితా విడుదల.. 11 అసెంబ్లీ, 13 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన

గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో అధికార కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని కూడా గెలుచుకోలేక పోయింది. అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రేటర్ పై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక దృష్టిసారించింది. ఈ క్రమంలో ఇప్పటికే 13 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం ఆయనకు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. గ్రేటర్ పరిధిలోని మరో ఎమ్మెల్యేతోపాటు, జీహెచ్ఎంసీ మేయర్, పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో గద్వాల విజయలక్ష్మీతో దీపదాస్ మున్షీ సమావేశం కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. గద్వాల విజయలక్ష్మీ, మరో 10 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెలుస్తోంది.

Also Read : MLC Kavitha : సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు.. ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచన

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ సభ్యులు కే. కేశవరావు కుమార్తె. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బంజారాహిల్స్ బీఆర్ఎస్ కార్పొరేటర్ గా ఆమె విజయం సాధించారు. 2021లోనూ రెండోసారి గెలిచి మేయర్ అయ్యారు.