Ktr: పురపోరు ఇంచార్జ్‌లపై కేటీఆర్ సీరియస్.. వారికి ఇచ్చిన వార్నింగ్ ఏంటి?
మున్సిపల్ ఎన్నికలపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టింది. పెద్దగా ఫోకస్ పెట్టకపోయినా పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడంతో గులాబీ పార్టీ ఉత్సాహంగా ఉంది.
Ktr Representative Image (Image Credit To Original Source)
- మున్సిపల్ ఎన్నికలపై బీఆర్ఎస్ సీరియస్ ఫోకస్
- మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్‌లపై కేటీఆర్ అసంతృప్తి
- ఎన్నికలు ముగిసే వరకు హైదరాబాద్‌లో కనిపించొద్దని వార్నింగ్
Ktr: ఎన్నికల నగారా మోగింది. మున్సిపోల్స్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. మున్సిపల్ ఎన్నికలు అయ్యే వరకు ముఖ్యనేతలెవరూ హైదరాబాద్‌లో కనిపించొద్దు. తెలంగాణ భవన్ వైపు అస్సలే రావొద్దు. ఎన్నికల ఫలితాల తర్వాతే కనిపించాలంటూ..పార్టీ నేతలకు రెండు రోజుల క్రితమే తేల్చి చెప్పారట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మున్సిపల్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుని ఇంచార్జ్‌లను నియమిస్తే వాళ్లంతా ఫీల్డ్‌లోకి వెళ్లకుండా తెలంగాణ భవన్ చుట్టూ తిరగడంపై కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలు ముగిసే వరకు ఇంచార్జ్‌లు సహా నేతలెవ్వరు హైదరాబాద్‌వైపు కన్నెత్తి చూడొద్దని వార్నింగ్ ఇచ్చారట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమైంది. 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది ఈసీ. ఫిబ్రవరి 11న పోలింగ్..ఫిబ్రవరి 13న కౌంటింగ్..జనవరి 28 నుంచే నామినేషన్స్ అంటూ ఈసీ ప్రకటన ఇచ్చేసింది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న ప్రధాన పార్టీలు దూకుడు పెంచేశాయి. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పార్టీ జనసేన, జాగృతి కవితక్క మద్దతుతో ఫార్వర్డ్ బ్లాక్ కూడా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. దీంతో ఈసారి మున్సిపల్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారడం ఖాయంగా కన్పిస్తోంది.
ఇక మున్సిపల్ ఎన్నికలపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టింది. పెద్దగా ఫోకస్ పెట్టకపోయినా పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడంతో గులాబీ పార్టీ ఉత్సాహంగా ఉంది. దీంతో మున్సిపల్ పోరుపై ఫుల్ ఫోకస్ పెట్టి సత్తా చాటాలని స్కెచ్ వేస్తోంది. అధికార పార్టీకి ధీటుగా సాధ్యమైనన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను దక్కించుకోవాలని భావిస్తోంది. గులాబీ బాస్ కేసీఆర్ సూచనతో పార్టీ తరఫున రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రత్యేక ఇంచార్జ్‌లను నియమించింది.
సీనియర్ నాయకుడికి ఇంచార్జ్ బాధ్యతలు..
మొత్తం రాష్ట్రంలోని 122 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు సీనియర్ నాయకుడికి ఇంచార్జ్ బాధ్యతలు ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేలా కార్యకర్తలు, నాయకుల సమన్వయంతో పని చేయాలని బీఆర్ఎస్ ధినేత కేసీఆర్ సూచించారు. ఎర్రవల్లిలోని ఫాంహౌజ్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో సమావేశమై దిశానిర్ధేశం చేశారు.
ఎప్పటిలాగే తెలంగాణ భవన్ లోనే..
నోటిఫికేషన్ రిలీజ్ కాకముందే ఇంచార్జ్‌లను ప్రకటించినా.. వారు ఇంకా ఫీల్డ్‌లోకి దిగకపోవడంపై కేటీఆర్ అసంతీప్తి వ్యక్తం చేశారట. మూడు రోజుల క్రితమే గ్రౌండ్లోకి వెళ్లి స్థానిక నేతలను, కార్యకర్తలను సమన్వయం చేసుకుని పని చేయాలని చెప్పారట. అయితే బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్‌లు కొందరు మాత్రం కేటీఆర్ ఆదేశాలను పెడచెవిన పెట్టినట్లు చర్చ జరుగుతోంది. ఇంచార్జ్లుగాగా నియమించబడ్డ సదరు నేతలంతా ఎప్పటిలాగే తెలంగాణ భవన్ చుట్టూ తిరుగుతుండటం..కేటీఆర్ కళ్లల్లో పడటమే లక్ష్యంగా హడావుడి చేస్తుండటంతో వారిపై ఆయన సీరియస్ అయినట్లు టాక్. యధావిధిగా మరే నాయకుడిని, కార్యకర్తలను కేటీఆర్ దరిదాపుల్లోకి కూడా రాకుండా వాళ్లే ఆయన చుట్టూ చేరిపోతున్నారనే చర్చ జరుగుతోంది.
నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కేటీఆర్ తీవ్ర ఆవేదన..
మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్‌లు..హైదరాబాద్ తెలంగాణ భవన్లో హడావుడి చేయడాన్ని గమనించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మున్సిపాలిటీల వారిగా నియమించిన ఇంచార్జ్‌లపై సీరియస్ అయ్యారని తెలుస్తోంది. తామంతా మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను ఎలా గెలవాలని రాత్రింబవళ్లు పని చేస్తుంటే ఇంచార్జ్‌లు మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. అధినేత కేసీఆర్ స్వయంగా మున్సిపాలిటీల వారిగా ఇంచార్జ్‌లను నియమించి, వెంటనే గ్రౌండ్లోకి వెళ్లాలని ఆదేశించినా..నేతలు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలంగాణ భవన్ వర్గాల టాక్.
ఇకనైనా ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించిన నేతలంతా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు వెళ్లాలని కేటీఆర్ సీరియస్‌గా ఆదేశించారని సమాచారం. ఇంచార్జ్‌లు ఎవ్వరూ మున్సిపల్ ఎన్నికలు ముగిసే వరకు తెలంగాణ భవన్‌కు రావొద్దని తేల్చి చెప్పారట. కేటీఆర్ ఆదేశాలతోనైనా మున్సిపల్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుని బీఆర్ఎస్ నేతలు గ్రౌండ్లోకి వెళ్తారా లేక తెలంగాణ భవన్ చుట్టే తిరుగుతారా అనేది చూడాలి.
Also Read: నర్సాపూర్ కాంగ్రెస్‌లో మూడు ముక్కలాట.. గ్రూపు పాలిటిక్స్‌కు రీజనేంటి?
