Gudem Mahipal Reddy: తప్పు చేశా…! ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి యూటర్న్..! మిగతా వాళ్లది అదే దారేనా?
సరిగ్గా మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం అవుతున్న వేళ.. మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ పార్టీలో కలవరం రేపుతున్నాయ్. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం కాకుండా..
Gudem Mahipal Reddy Representative Image (Image Credit To Original Source)
- బీఆర్ఎస్ వదిలేసి తప్పు చేశానన్న మహిపాల్..
- మహిపాల్ వ్యాఖ్యలతో పాలిటిక్స్‌లో కొత్త రచ్చ
- మిగతా ఎమ్మెల్యేలది ఇదే అభిప్రాయమా?
- ఇప్పుడు మహిపాల్.. మరి నెక్ట్స్ ఎవరు ?
Gudem Mahipal Reddy: బీఆర్ఎస్ ని వదిలి తప్పు చేశాను.. కాంగ్రెస్‌లో చేరితే ప్రజలకు కానీ తనకు కానీ ఒరిగిందేమి లేదు.. అంటూ పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయ్. పార్టీ ఫిరాయింపుల కేసులో.. ఏడుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్‌చిట్ ఇచ్చిన తర్వాత మహిపాల్ ఇలాంటి కామెంట్స్ చేయడం ఆసక్తి రేపుతోంది. ఆయన ఎందుకు ఇలా మాట్లాడారు.. ఇది మహిపాల్ రెడ్డి ఒక్కరి అభిప్రాయమేనా.. మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలూ ఇదే ఫీలింగ్ తో ఉన్నారా? ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ లో జోష్ కి, కాంగ్రెస్ లో టెన్షన్ కి కారణం అవుతోందనే టాక్ నడుస్తోంది.
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయాల్లో సంచలన రేపుతున్నాయి. ముఖ్య అనుచరులతో నిర్వహించిన అంతర్గత సమావేశంలో.. కాంగ్రెస్ పార్టీపై మహిపాల్ రెడ్డి విరుచుకుపడ్డారు. మున్సిపల్ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఈ భేటీ జరిగింది. బీఆర్ఎస్ పార్టీని వీడి తాను తప్పు చేశానంటూ మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో హీట్ పుట్టిస్తున్నాయ్.
ఒత్తిడికి లోనై తప్పటడుగు..!
అప్పుడున్న పరిస్థితుల్లో తప్పటడుగు వేసి కాంగ్రెస్‌లో చేరానని.. ఐతే హస్తం పార్టీతో తనకు కానీ, తన నియోజకవర్గానికి కానీ, ప్రజలకు కానీ జరిగిన లాభం ఏమీ లేదంటూ చేసిన కామెంట్ కాక పుట్టిస్తోంది. బీఆర్ఎస్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని.. కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా ఒత్తిడికి లోనై.. తప్పటడుగు వేశానని అన్నారు మహిపాల్. అక్కడితో ఆగకుండా.. మున్సిపల్ ఎన్నికల్లో.. బీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూచించినట్లు తెలుస్తోంది. ఇదే రాజకీయాన్ని మరింత ఆసక్తికరంగా మార్చేస్తోంది.
సీఎంతో సఖ్యత లేదు, స్థానిక కాంగ్రెస్ నాయకులతో నిత్యం గొడవలే..
పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి గెలిచి.. ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందులో సాంకేతికంగా ఏడుగురు ఎమ్మెల్యేలది కారు పార్టీనే అని స్పీకర్ తీర్పు ఇచ్చినా.. వాళ్లంతా హస్తం పార్టీతోనే పొలిటికల్ జర్నీ చేస్తున్నారు. ఆ ఎమ్మెల్యేల లిస్టులో గూడెం మహిపాల్ రెడ్డి కూడా ఉన్నారు. బీఆర్ఎస్ తరఫున మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన మహిపాల్‌కు.. సీఎం రేవంత్, మంత్రి దామోదర రాజనర్సింహ సహా కాంగ్రెస్ నేతలతో సఖ్యత కుదరలేదనే చర్చ నడుస్తోంది. ఇక స్థానిక కాంగ్రెస్ నేతలతో.. ఆయనకు ఎప్పుడూ గొడవలే ! పటాన్‌చెరు పంచాయితీపై గతంలో ఫిర్యాదులు కూడా వెళ్లాయ్ అధిష్టానానికి! అప్పటి నుంచి మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో ఉంటున్నా.. అధికార పార్టీతో మాత్రం అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలను తిరిగి చేర్చుకోకూడదనే నిర్ణయం తీసుకోవడంతో మహిపాల్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది.
మళ్లీ సొంతగూటికి చేరుకునేందుకు మహిపాల్ ప్లాన్?
అయితే సరిగ్గా మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం అవుతున్న వేళ.. మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ పార్టీలో కలవరం రేపుతున్నాయ్. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం కాకుండా బీఆర్ఎస్ గెలుపు కోసం పని చేయాలని మహిపాల్ రెడ్డి పిలుపునివ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఎలాగైనా నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేసి.. మళ్లీ సొంతగూటికి చేరుకునేందుకు మహిపాల్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారన్నటాక్ నడుస్తోంది. ఇక అటు మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలతో.. బీఆర్ఎస్ లో జోష్ కనిపిస్తోంది. కారు దిగి కాంగ్రెస్‌లో చేరిన మిగిలిన ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తితో ఉన్నారని.. బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. వారూ వస్తామంటూ రాయబారాలు చేస్తున్నా తామే చేర్చుకోవడం లేదంటున్నారు. మహిపాల్ రెడ్డి తన మనసులోని మాట బయటకు చెప్పారని.. మిగిలిన వాళ్లు చెప్పలేకపోతున్నారని అంటున్నారు.
మహిపాల్ రెడ్డితో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా నిజంగానే అసంతృప్తితో ఉన్నారా అనే అనుమానం హస్తం పార్టీలో మొదలైంది. అదే జరిగితే.. మున్సిపల్ ఎన్నికల్లో నష్టం తప్పదని హస్తం పార్టీ శ్రేణులు కంగారు పడుతున్నాయని టాక్. ఇక అటు సాంకేతికంగా ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్‌లోనే ఉన్నారని స్పీకర్ తీర్పు ఇచ్చారు. దీంతో ఆ ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశాలు ఉన్నట్లేననే చర్చ జరుగుతోంది. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ లో గుబులు రేపుతోంది.
Also Read: జూపల్లి టు భట్టి.. మంత్రుల చుట్టూ వరుస వివాదాలు.. సీఎం ఏం చేయబోతున్నారు?
