MLC elections: ఎమ్మెల్యే కోటా మండలి సీటు కోసం నేతల పోటాపోటీ.. వీరిద్దరికి బెర్త్‌లు ఖాయమా?

ఎస్టీ సామాజికవర్గానికి చెందిన విజయా భాయి..రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పారిజాత నర్సింహారెడ్డిలో ఒకరికి చాన్స్ ఇవ్వొచ్చంటున్నారు.

MLC elections: ఎమ్మెల్యే కోటా మండలి సీటు కోసం నేతల పోటాపోటీ.. వీరిద్దరికి బెర్త్‌లు ఖాయమా?

MLC elections

Updated On : February 27, 2025 / 8:21 PM IST

తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటు రేసు ఇంట్రెస్టింగ్‌గా మారింది. అసెంబ్లీలో సంఖ్యాబలం ఆధారంగా నాలుగు ఎమ్మెల్సీ సీట్లు కాంగ్రెస్‌కు దక్కే ఛాన్స్ ఉంది. వీటిలో ఒకటి మిత్రపక్షాలైన సీపీఐ లేదా ఎంఐఎంకు ఇవ్వాలని డిసైడ్ అయిందట కాంగ్రెస్ పార్టీ. ఇక మిగిలిన మూడు సీట్లకు పదుల సంఖ్యలో ఆశావహులు ఉన్నప్పటికీ..ఎవరికి ఛాన్స్ ఇవ్వాలనే దానిపై హస్తం పార్టీ పెద్దలు ఒక స్పష్టతకు వచ్చినట్లు టాక్ నడుస్తోంది.

సామాజిక సమీకరణాల ఆధారంగా మూడు సీట్లను భర్తీ చేయబోతున్నారట. ఇందులో ఒకటి మాత్రం గన్ షాట్‌గా అద్దంకి దయాకర్‌కు దక్కనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అద్దంకి దయాకర్‌కు ఇప్పటికే రెండు, మూడు సార్లు అవకాశాలు మిస్ కావడంతో ఈ సారి ఆయనకు బెర్త్‌ పక్కా అన్న చర్చ కాంగ్రెస్‌ పార్టీలో నడుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో సీటు దక్కకున్నా..పార్లమెంట్ ఎన్నికల్లో సీటు రాకున్నా..ఆఖరికి ఒకసారి ఎమ్మెల్సీ ఛాన్స్ మిస్ అయినా..అద్దంకి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. అందుకే ఈ సారి అద్దంకి దయాకర్‌కు ఎట్టి పరిస్థితిల్లో చాన్స్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి గట్టి పట్టుబడుతున్నట్లు పార్టీ వర్గాల టాక్.

ఇక రెండో ఎమ్మెల్సీ సీటును సీఎం రేవంత్‌ పొలిటికల్ అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డికి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వేం నరేందర్ రెడ్డి సీఎంకు పొలిటికల్ వ్యవహారాల్లో చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా వేంకు ఎమ్మెల్సీ సీటు కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు. ఈ సారి పార్టీ తరఫున అవకాశం ఉంది కాబట్టి వేం నరేందర్ రెడ్డికి ఇప్పించుకోవాలని చూస్తున్నారట. అయితే వేంను రాజ్యసభ పంపించాలని గతంలో భావించారు.

మూడో సీటును మహిళలకే ఇస్తారా?
ఆయన మాత్రం ఢిల్లీ వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపడం లేదట. దీంతో వేం నరేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి స్టేట్ పాలిటిక్స్‌లో ఆయన సేవలను వాడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. కాంగ్రెస్‌కు దక్కే మూడో సీటు కచ్చితంగా మహిళకే ఇవ్వాలని పార్టీ డిసైడ్ అయిందట. ఖమ్మం జిల్లా వైరాకు చెందిన విజయా భాయి, రంగారెడ్డి జిల్లా మహేశ్వరంకు చెందిన పారిజాత నర్సింహారెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ నేరెళ్ల శారద, ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ బండ్రు శోభారాణి వంటి నేతలు ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు.

కానీ ఎస్టీ సామాజికవర్గానికి చెందిన విజయా భాయి..రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పారిజాత నర్సింహారెడ్డిలో ఒకరికి చాన్స్ ఇవ్వొచ్చంటున్నారు. అయితే రాజ్యసభ సీట్లలో ఇప్పటికే మిగతా సామాజిక వర్గాలకు ఛాన్స్ ఇచ్చారు. దాంతో ఎమ్మెల్సీగా రెడ్డి సామాజికవర్గం నేతకు అవకాశం కల్పించాలని భావిస్తున్నారట. ఏదైనా అనివార్య కారణాలతో వేం నరేందర్‌రెడ్డికి చాన్స్‌ మిస్ అయితే పారిజాత నర్సింహారెడ్డికి బెర్త్‌ దక్కనుందంటున్నారు. అదే జరిగితే మరోసీటు బీసీ నేతకు దక్కవచ్చు. ఏదేమైనా మూడు ఎమ్మెల్సీల్లో ఒకటి అద్దంకి దయాకర్ పోగా మిగిలిన రెండింటిలో..వేం నరేందర్‌రెడ్డి, విజయాబాయ్, పారిజాత నర్సింహారెడ్డిలలో ఎవరికి అదృష్టం దక్కనుందనేది చర్చనీయాంశంగా మారింది.