మంత్రివర్గ విస్తరణకు ఎందుకు బ్రేక్ పడింది.? కారణం ఆ జిల్లా సీనియర్లేనా?

నేతలు పదవుల కోసం పోటాపోటీగా ఒత్తిడి తెస్తుండటంతో ఏం చేయాలో అర్థం కాక పార్టీ హైక‌మాండ్ త‌ల ప‌ట్టుకుంటోదంటున్నారు. క‌ర‌వ‌మంటే క‌ప్పకు కోపం.. విడువమంటే పాముకు కోపం అన్న చందంగా నేతల తీరు ఉండటం.. ఎవ‌రికి ఏం స‌ర్ది చెప్పాలో అర్థం కాకపోవడంతో కొన్ని రోజుల పాటు మంత్రివర్గ విస్తరణను హోల్డ్‌లో పెట్టాల‌ని నిర్ణయించింది కాంగ్రెస్‌ అధిష్టానం.

మంత్రివర్గ విస్తరణకు ఎందుకు బ్రేక్ పడింది.? కారణం ఆ జిల్లా సీనియర్లేనా?

Gossip Garage : తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక‌మైన పీసీసీ చీఫ్ ఎంపిక‌, మంత్రివ‌ర్గ విస్తర‌ణ ఎందుకు బ్రేక్ ప‌డింది? నెల రోజుల త‌ర్జన‌భ‌ర్జన త‌ర్వాత కూడా వ్యవ‌హారం కొలిక్కి రాక‌పోవ‌డానికి కార‌ణం ఏంటి? గాంధీ భవన్‌లో ఏ ఇద్దరు ముఖ్యనేత‌లు ఎదురైనా ఇదే చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే దీనికంత‌టికి కార‌ణం ఒక్క జిల్లాకు చెందిన సీనియ‌ర్ల మ‌ధ్య పోటీయే అంటూ కొందరు తేల్చేస్తున్నారు. ఒకరికొకరు పోటీగా పదవులను ఆశిస్తుండటమే కాకుండా, వారు పెడుతున్న కండిష‌న్లతో ఏం చేయాలో తేల్చుకోలేక పార్టీ హైక‌మాండ్ మంత్రివర్గ విస్తరణను హోల్డ్‌లో పెట్టింద‌ట‌. పార్టీ హైకమాండ్‌కే తలనొప్పిగా మారిన నేత‌లు ఎవరు? వారి డిమాండ్లు ఏంటి..? వారికి మంత్రివ‌ర్గ విస్తర‌ణ‌కు ఉన్న లింక్ ఏంటి?

నేత‌ల వ్యవ‌హారం కార‌ణంగానే పదవుల భర్తీ ప్రక్రియకు ఫుల్‌స్టాప్‌..?
కాంగ్రెస్‌ పార్టీలో నేత‌ల‌కు స్వేచ్ఛ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరికి వారే ఓ హైకమాండ్‌ అన్నట్లే ఉంటుంది కాంగ్రెస్‌ తీరు. పార్టీలో మితిమీరిన ఈ ప్రజాస్వామ్యమే కొన్నిసార్లు చికాకులు తెస్తోంది. తాజాగా నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ల వ్యవహారంతో ఏకంగా మంత్రివర్గ విస్తరణే పెండింగ్‌లో పడిపోయింది. తెలంగాణ కాంగ్రెస్‌లో సయోధ్య లేకే పీసీసీ చీఫ్, మంత్రివ‌ర్గ విస్తర‌ణపై అధిష్టానం కసరత్తు కొలిక్కి రావడం లేదని గాందీభవన్‌ టాక్‌. మ‌రీ ముఖ్యంగా న‌ల్లగొండ జిల్లాకు చెందిన నేత‌ల వ్యవ‌హారం కార‌ణంగానే పదవుల భర్తీ ప్రక్రియకు ఫుల్‌స్టాప్‌ పడిందని చ‌ర్చ జ‌రుగుతోంది.

మంత్రి పదవి ఇచ్చి అన్న మాట నిలబెట్టుకోవాల్సిందేనని డిమాండ్…
ఉమ్మడి న‌ల్లగొండ జిల్లాకు చెందిన నేత‌లు మంత్రివ‌ర్గ విస్తర‌ణలో చోటు ద‌క్కించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు… వారు పెడుతున్న కండీషన్లతో మొత్తం ప్రక్రియను పెండింగ్‌ పెట్టాలని హైకమాండ్‌ నిర్ణయించిందట.. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా నుంచి సీనియర్‌ నేతలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మంత్రివ‌ర్గంలో కొనసాగుతున్నారు. తాజా మంత్రివ‌ర్గ విస్తర‌ణ‌లో త‌న‌కు చోటు క‌ల్పించాల‌ని మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి గ‌ట్టిగా ప‌ట్టుబ‌డుతున్నారు.

బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వస్తే మంత్రివ‌ర్గంలో అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని అధిష్టానం పెద్దలు తనకు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ… తనకు ఎట్టిపరిస్థితుల్లోనూ మంత్రి వర్గంలో చోటివ్వాలని డిమాండ్‌ చేస్తున్నారట రాజగోపాల్‌రెడ్డి. పార్లమెంట్ ఎన్నిక‌ల్లో కూడా భువ‌న‌గిరి పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించుకొస్తే కచ్చితంగా మంత్రిప‌ద‌వి ఇస్తామని మరోసారి హామీ ఇచ్చారని… తనకు మంత్రి పదవి ఇచ్చి అన్న మాట నిలబెట్టుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారట రాజగోపాల్‌రెడ్డి.

తన భార్యకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని పట్టు..
పార్టీ పెద్దల ఆదేశాల మేర‌కు భువ‌న‌గిరి పార్లమెంట్ ఎన్నిక‌ల్లో పూర్తి బాధ్యతలు తీసుకొని భారీ మెజారిటీతో గెలిపించానని గుర్తు చేస్తూ అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు రాజగోపాల్‌రెడ్డి. తామిచ్చిన మాట ప్రకారం రాజగోపాల్‌రెడ్డిని క్యాబినెట్‌లోకి తీసుకోడానికి అధిష్టానం కూడా సిద్ధమైందని సమాచారం. ఐతే ఇక్కడే అస‌లు ట్విస్ట్ మొద‌లైందంటున్నారు. సీనియ‌ర్ నేత, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి రంగంలోకి దిగి.. రాజగోపాల్‌రెడ్డికి మంత్రిగా అవకాశమిస్తే… తన భార్యకు క్యాబినెట్‌లో బెర్త్‌ ఇవ్వాలని పట్టుబడుతున్నారట… కోమ‌టిరెడ్డి ఫ్యామిలీలో ఇప్పటికే వెంక‌ట్‌రెడ్డి మంత్రిగా ఉన్నారని.. రాజ‌గోపాల్ రెడ్డి త‌న అవ‌స‌రానికి బీజేపీలోకి వెళ్లి.. తిరిగి కాంగ్రెస్‌లోకి వ‌చ్చారని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట..

మంత్రి కండీషన్ తో డైలమాలో హైకమాండ్..
జిల్లాలో కోమటిరెడ్డి కుటుంబానికే రెండు మంత్రి ప‌ద‌వులిస్తే.. పార్టీకి లాయ‌లిస్ట్‌గా ప‌నిచేసిన త‌మ కుటుంబం సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు ఉత్తమ్‌… ఏడేళ్ల పాటు పీసీసీ చీఫ్‌గా పనిచేసిన తాను పార్టీ అప్పగించిన ప్రతిప‌నినీ తూ.చ. తప్పకుండా నెరవేర్చానని గుర్తుచేస్తున్నారట ఉత్తమ్‌. అంతేకాకుండా న‌ల్లగొండ పార్లమెంట్ బాధ్యత తీసుకొని రికార్డు మెజారిటీతో గెలిపించామ‌ని చెబుతున్నారు ఉత్తమ్‌. మంత్రివ‌ర్గంలో జిల్లాకు ఛాన్స్ ఇస్తే.. త‌న భార్య కోదాడ ఎమ్మెల్యే ప‌ద్మావ‌తికి అవ‌కాశం క‌ల్పించాల‌ని డిమాండ్‌ చేస్తున్నట్లు గాంధీభవన్‌ సమాచారం. మంత్రి ఉత్తమ్ కండిషన్‌తో హైకమాండ్‌ డైలమాలో పడిపోయిందని అంటున్నారు.

ఏం చేయాలో తేల్చుకోలేని కాంగ్రెస్‌ అధిష్టానం..
ఇలా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తమ ప్రయత్నాలు చేస్తుండగా, ఉమ్మడి నల్గొండకే చెందిన మరో ఎమ్మెల్యే కూడా మంత్రి పదవి ఆశిస్తూ మంత్రాంగం నడుపుతుండటం కాంగ్రెస్‌లో కాకరేపుతోంది. మంత్రి వ‌ర్గంలో లంబాడ సామాజిక వ‌ర్గానికి అవ‌కాశం క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తూ.. దేవ‌ర‌కొండ ఎమ్మెల్యే బాలూనాయ‌క్ మంత్రివ‌ర్గ రేసులోకి వ‌స్తున్నారు. ఇప్పుడు ఉన్నవే ఆరు బెర్తులు.. వీటిని సామాజిక సమీక‌ర‌ణాల ఆధారంగా ఫుల్ పిల్ చేయాల్సి ఉంటుందని… ఆరులో మూడు బెర్తులు ఒకే జిల్లా వారు అడుగుతుండటంతో ఏం చేయాలో తేల్చుకోలేని కాంగ్రెస్‌ అధిష్టానం… పీసీసీతోపాటు మంత్రి పదవుల భర్తీని పెండింగ్‌లో పెట్టిందంటున్నారు.

నేతలు పదవుల కోసం పోటాపోటీగా ఒత్తిడి తెస్తుండటంతో ఏం చేయాలో అర్థం కాక పార్టీ హైక‌మాండ్ త‌ల ప‌ట్టుకుంటోదంటున్నారు. క‌ర‌వ‌మంటే క‌ప్పకు కోపం.. విడువమంటే పాముకు కోపం అన్న చందంగా నేతల తీరు ఉండటం.. ఎవ‌రికి ఏం స‌ర్ది చెప్పాలో అర్థం కాకపోవడంతో కొన్ని రోజుల పాటు మంత్రివర్గ విస్తరణను హోల్డ్‌లో పెట్టాల‌ని నిర్ణయించింది కాంగ్రెస్‌ అధిష్టానం.

మంత్రి వర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ వ్యవహారం హోల్డ్…
సో.. ఇలా మంత్రివ‌ర్గ విస్తర‌ణ విష‌యంలో చిక్కుముడులు పడటంతో పీసీసీ చీఫ్ వ్యవ‌హారాన్ని కూడా ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టింది కాంగ్రెస్‌ హైకమాండ్‌. మంత్రివ‌ర్గంలో సామాజిక సమీక‌ర‌ణాల ప్రకారం ఛాన్స్ దొర‌క‌ని వారికి పీసీసీలో అవ‌కాశం క‌ల్పించాల‌నే ఆలోచ‌న‌తో ప‌క్కన పెట్టారు. ఫైన‌ల్‌గా ఈ వ్యవ‌హారాన్ని పార్టీ ఎలా డీల్ చేస్తుంద‌నేది ఉత్కంఠ రేపుతోంది.

Also Read : భయమా, అనుమానమా.. చంద్రబాబు, రేవంత్ భేటీపై కాంగ్రెస్ నేతలకు అభ్యంతరం ఎందుకు?