సింగరేణిలో పెద్ద స్కాం.. హైకోర్టు, సీబీఐకి వెళ్తామన్న హరీశ్ రావు

ఇటీవల దుమారం రేపిన సింగరేణి వివాదంపై మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.

సింగరేణిలో పెద్ద స్కాం.. హైకోర్టు, సీబీఐకి వెళ్తామన్న హరీశ్ రావు

Harish Rao, Revanth Reddy (Image Credit To Original Source)

Updated On : January 19, 2026 / 2:23 PM IST
  • మంత్రుల మధ్య వాటాల పంచాయితీ
  • రాష్ట్రంలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయి
  • మంత్రుల పంచాయితీలో అధికారులు బలి: హరీశ్

Harish Rao: తెలంగాణలో కేబినెట్ మంత్రుల మధ్య వాటాల పంచాయితీ నడుస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయని, సింగరేణిలో పెద్ద స్కామ్ జరుగుతోందని, దీనిపై తాము హైకోర్టుకు వెళ్తామన్నారు. అలాగే సీబీఐకి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. సింగరేణి వివాదానికి సంబంధించి కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సీబీఐ విచారణ జరిపించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

ఇటీవల దుమారం రేపిన సింగరేణి వివాదంపై మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. బొగ్గుగని కాంట్రాక్టును రేవంత్ రెడ్డి బంధువుకు ఇప్పించుకునేందుకే సైట్ విజిట్ నిబంధనను సీఎం తీసుకొచ్చారని హరీశ్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి బావమరిదికి నైనీ బొగ్గు గనులను కట్టబెట్టేందుకు ప్రయత్నం జరుగుతోందన్నారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కిషన్ రెడ్డిని డిమాండ్ చేశారు.

మంత్రుల పంచాయితీలో అధికారులు బలవుతున్నారని హరీశ్ అన్నారు. అలాగే, జర్నలిస్టులను కూడా బలిపశువులను చేశారన్నారు. వ్యాపారులకు గన్ పెట్టి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించినందుకే మంత్రి కొండా సురేఖ పీఏను అరెస్ట్ చేయడానికి పోలీసులు ఆమె ఇంటికి వెళ్లారన్నారు.

అలాగే, సమ్మక్క సారక్క టెండర్ల విషయంలో కూడా పొంగులేటి, కొండా మధ్య గొడవలు వచ్చినట్టు హరీశ్ చెప్పారు. హోలోగ్రామ్ విషయంలో సీఎం రేవంత్, మంత్రి జూపల్లి మధ్య గొడవలతో మరో అధికారి ట్రాన్స్ ఫర్ అయ్యారన్నారు. సినిమా టికెట్ల రేట్ల పెంపు విషయంలో సీఎంకి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య గొడవ జరుగుతోందన్నారు.

భట్టిపై వార్తల వెనుక ఎవరున్నారో బయటపెట్టాలని, ఒకవేళ బయటపెట్టకపోతే సీఎం, డిప్యూటీ సీఎం మధ్య వాటాలు కుదిరినట్టే అనుకోవాల్సి వస్తుందన్నారు.

బీఆర్ఎస్ ను బొందపెట్టినప్పుడే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుందని ఖమ్మం జిల్లాలో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ భూస్థాపితం చేస్తేనే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుందన్నారు.