Budget 2025: బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి.. కేంద్రంపై హరీశ్, కవిత ఫుల్ ఫైర్

ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు నిధులు కేటాయించి, ఎన్నికలు లేని రాష్ట్రాలకు నిధులు ఇవ్వలేదని హరీశ్ అన్నారు.

Budget 2025: బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి.. కేంద్రంపై హరీశ్, కవిత ఫుల్ ఫైర్

Harish Rao, Kavitha

Updated On : February 1, 2025 / 4:30 PM IST

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి చూపించారని తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యసీ కవిత మండిపడ్డారు. ఈ బడ్జెట్‌ను బీజేపీ తన రాజకీయ అవసరాలే ఉపయోగించుకున్నదని హరీశ్ రావు ట్వీట్ చేశారు. కేంద్ర సర్కారు పదే పదే చెబుతున్న వికసిత్ భారత్ ఇలాంటి వైఖరితో సాధ్యమవుతుందా? అని అన్నారు.

ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో వరాలు ప్రకటించిన కేంద్ర సర్కారు.. ఎన్నికలు లేని రాష్ట్రాల పట్ల వివక్ష చూపడం సరికాదని హరీశ్ రావు చెప్పారు. దేశమంటే మట్టి కాదోయో దేశమంటే మనుషులోయ్ అంటూ ప్రసంగించిన నిర్మల సీతారామన్, దేశమంటే కొన్ని రాష్ట్రాలే అన్నట్లు బడ్జెట్ ప్రవేశ పెట్టడం బాధాకరమని విమర్శించారు.

మొదటి నుంచి ఇదే దోరణిని ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వం రాజకీయ అవసరాలు తీర్చుకుంటోందని చెప్పారు. 2024లో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, 2025 ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల కోసం బడ్జెట్ పెట్టారని. 2026 యూపీ బడ్జెట్, 2027 గుజరాత్ కోసం బడ్జెట్ పెడుతారా? అని అన్నారు. యావత్ దేశానికి సరిపోయే బడ్జెట్ ఎప్పుడు పెడతారని నిలదీశారు.

బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి చోటు లేదా? తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు విలువ లేదా? అని హరీశ్ రావు అన్నారు. ఇది కేంద్ర బడ్జెట్ లా లేదు, కేవలం మూడు, నాలుగు రాష్ట్రాల బడ్జెట్ లాగా ఉందని చెప్పారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఏం సాధించినట్లని నిలదీశారు. తెలంగాణతో తమకు బంధం లేదని బడ్జెట్ ద్వారా మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరూపించిందని చెప్పారు.

ఎన్నికలు దగ్గర ఉన్నాయని ఇప్పటి బడ్జెట్ లో బిహార్ కు మరిన్ని వరాల జల్లు కురిపించారని హరీశ్ రావు అన్నారు. నమ్మి 16 సీట్లలో కాంగ్రెస్, బీజేపీని గెలిపిస్తే, ఇద్దరూ కలిసి తెలంగాణకు మొండి చెయ్యి ఇచ్చారని విమర్శించారు. 8 మంది బిజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, రాష్ట్రానికి ప్రత్యేకంగా 8 రూపాయలు కూడా అధికంగా సాధించిన దాఖలాలు లేవని చురకలు అంటించారు.

జీరో ఇచ్చారు: కవిత
బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఎనిమిది మందిని చొప్పున ఎంపీలుగా ఎన్నుకున్నప్పటికీ.. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు సున్నా నిధులు వచ్చాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ‘ఎక్స్’లో ఈ మేరకు ఆమె ఒక పోస్ట్‌ చేశారు.

“తెలంగాణకు 8 మంది బీజేపీ ఎంపీలు + 8 మంది కాంగ్రెస్ ఎంపీలు = 0” అని పేర్కొన్నారు.