ప్రభుత్వం 4 రూపాయలు కూడా ఇవ్వలేదు: హరీశ్ రావు
మొదటి శాసన సభలో 6 గ్యారెంటీలకు చట్టం చేస్తామన్నారని, రెండవ సభ నడుస్తున్నప్పటికీ గ్యారెంటీలకు చట్టం చేయలేదని హరీశ్ రావు విమర్శించారు.

Harish Rao
Harish Rao: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ రైతులను, ప్రజలను నిరాశ పరిచిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కొండంత ఆశను చూపిన కాంగ్రెస్ సర్కారు గోరంత కూడా ఆ ఆశలను నెరవేర్చలేదని చెప్పారు. అన్నం పెట్టే రైతన్నలకు మట్టి కొట్టే విధంగా బడ్జెట్ ఉందని చెప్పుకొచ్చారు.
రైతు బంధు, రుణమాఫీ, బోనస్ కు బడ్జెట్ కేటాయింపులు లేవని తెలిపారు. రైతుల విషయంలో ప్రభుత్వం మోసం చేసిందని చెప్పారు. రూ.2 లక్షల రుణమాఫీకి 40 వేల కోట్ల రూపాయలు అవసరమని, కానీ ప్రభుత్వం 4 రూపాయలు కూడా ఇవ్వలేదని చెప్పారు.
వ్యవసాయానికి 82 వేల కోట్ల రూపాయలు అవసరమైతే 19 వేల కోట్ల రూపాయలను కేటాయించిందని హరీశ్ రావు అన్నారు. రైతుల ఆగ్రహానికి ప్రభుత్వం గురి కాక తప్పదని హెచ్చరించారు. తెలంగాణలో ఏ ప్రాంతంలోనూ 24 గంటల కరెంట్ రావడం లేదని తెలిపారు.
మొదటి శాసన సభలో 6 గ్యారెంటీలకు చట్టం చేస్తామన్నారని, రెండవ సభ నడుస్తున్నప్పటికీ గ్యారెంటీలకు చట్టం చేయలేదని హరీశ్ రావు విమర్శించారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామన్న హామీకి సంబంధించి బడ్జెట్లో స్పష్టత ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసంపూర్తిగా హామీలు అమలు చేస్తోందని చెప్పారు. 13 అంశాలున్న 6 గ్యారెంటీలలో రెండు అంశాలను మాత్రమే ఇచ్చిందని అన్నారు.
రాష్ట్రంలో సమస్యలు ఎదుర్కొంటున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరామని హరీశ్ రావు తెలిపారు. వారికీ ఎలాంటి కేటాయింపులు లేవని అన్నారు. అప్పులు చేశారంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించిన కాంగ్రెస్ కొత్తగా 19 వేల కోట్ల రూపాయలు తెస్తానంటోందని విమర్శించారు. అప్పులు తగ్గించాల్సిన సర్కారు కొత్త అప్పులు చేస్తానంటోందని చెప్పారు.
Also Read: Malla Reddy University : పురుగులు, కోడి ఈకలు వస్తున్నాయంటూ విద్యార్థుల ఆందోళన