Heavy Rains : తెలంగాణలో మళ్లీ దంచికొట్టనున్న వానలు.. ఈ జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు.. ఐదు జిల్లాలపై అధిక ప్రభావం..
Heavy Rains : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 24గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

Heavy Rains
Heavy Rains : తెలంగాణలో ఇటీవల వర్షాలు దంచికొట్టాయి. అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవడంతో పలు ప్రాంతాల్లోని వాగులు పొంగిపొర్లాయి. గోదావరి, కృష్ణా నదుల్లోకి వరదనీరు పోటెత్తింది. భారీ వర్షాల కారణంగా రైతులు సాగు చేసిన పంటలు దెబ్బతినడంతోపాటు.. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, గత ఐదు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే రెండురోజులు తెలంగాణలో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Also Read: వరుసగా ఐదు సీట్లకు ఉప ఎన్నికలు రాబోతున్నాయా? బైపోల్స్ రేసు గుర్రాల కోసం బీఆర్ఎస్ వేట!
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 24గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవన ద్రోణి కూడా కొనసాగుతోంది. ఈ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం, బుధవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల పరిధిలో భారీ వర్షాలు, ఇతర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో మినహా మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు ఐదు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కాస్త పెరిగాయి.
ఇదిలాఉంటే.. ఆగస్టు చివరి వారానికి చేరుకుంటున్నా తెలంగాణలోని పది జిల్లాల్లో లోటు వర్షపాతం కొనసాగుతోంది. ఈనెలలో కురిసిన అతిభారీ వర్షాలతో 18వ తేదీ నాటికి రాష్ట్ర సగటు సాధారణం కన్నా 14శాతం అధికంగా నమోదైంది. ఆ తరువాత వర్షాలు తగ్గుముఖం పట్టడంతో సోమవారం నాటికి తొమ్మిది శాతం లోటు వర్షపాతం నమోదైంది.
నిర్మల్ జిల్లాలో సాధారణం కన్నా 44శాతం, పెద్దపల్లి జిల్లాలో 21శాతం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 13శాతం, నల్గొండ జిల్లాలో 13శాతం, నిజామాబాద్ 12శాతం, జగిత్యాల 12శాతం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 11శాతం, మంచిర్యాల జిల్లాలో 10శాతం, సంగారెడ్డి జిల్లాలో 6శాతం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 4శాతం లోటు వర్షపాతం నమోదైంది.