Holi 2024: ఈ పూలు అందంగా కనిపించడమే కాదు.. రంగుల తయారీలోనూ..

Holi 2024: ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలుగా ఈ చెట్లు ఉపయోగపడతాయి.

Holi 2024: ఈ పూలు అందంగా కనిపించడమే కాదు.. రంగుల తయారీలోనూ..

Holi 2024

హోలీ అంటేనే కలర్స్‌… ఇది అనాదిగా వస్తున్న భారతీయ పండుగ. అయితే వెస్ట్రన్‌ కలర్స్‌తో హోలీ స్వభావమే మారిపోయింది. కృత్రిమ రంగులు ఎంత బ్రైట్‌ఫుల్‌గా కనిపిస్తాయో.. అంత చెడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. అయితే అక్కడ మాత్రం ఇప్పటికీ ప్రకృతి సిద్ధంగా దొరికే రంగులతోనే హోలీని జరుపుకుంటారు. అడవి తల్లి ఇచ్చిన పూలతో రంగులు తయారీ చేసి హోలీని సెలబ్రేట్‌ చేసుకుంటారు. పూలతో ఎలా రంగులు తయారు చేస్తారో మనమూ ఓసారి చూద్దాం.

వేసవి కాలంలో చెట్ల ఆకులు రాలిపోయి అటవీ ప్రాంతమంతా మోడుబారి వెలవెలబోతుంది. ఇదే సమయంలో మోదుగ పూలు విరబూసి కాషాయ రంగుతో అందంగా కనువిందు చేస్తుంటాయి. ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో మోదుగు పూలు చూపరులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.

ఇప్పటికీ చాలా గ్రామాల్లో..
ఈ పూలు అందంగా కనిపించడమే కాదు.. రంగుల తయారీలోనూ ఉపయోగపడుతాయి. కాముని పౌర్ణమి, హోలీ పండుగలకు అడవి నుంచి తెచ్చిన గోగుపూలతో సహజసిద్ధమైన రంగులను తయారు చేస్తుంటారు ఆదిలాబాద్ జిల్లావాసులు. ఇప్పటికీ చాలా గ్రామాల్లో… తండాల్లో మోదుగుపూలతో తయారు చేసిన రంగులతో హోలీ ఆడుతున్నారు.

హోలీకి రెండు రోజుల ముందు అటవీ ప్రాంతంలో దొరికే మోదుగ పూలను ఏరి తీసుకొస్తారు. అనంతరం వాటిని రోటిలో వేసి దంచుతారు. కొందరు కుండల్లో నీళ్లుపోసి ఉడకబెడతారు. ఆ నీటిని వడబోయడంతో కాషాయం రంగు తయారవుతుంది. ఇంకొందరు మోదుగు పూలను ఎండబెట్టి.. వాటిని పొడిలా చేసి నీటిలో ఉడకబెడతారు.

తర్వాత వడపోసి సహజసిద్ధమైన రంగు తయారు చేస్తారు. మరికొందరు… ఈ రంగు కాస్త గట్టిగా కావాలని దాంట్లో కాస్త పిండి కలుపుకొని వాడటం ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. ఇలా మోదుగుపూలతో చేసిన రంగులను కాముడి పౌర్ణిమతో పాటు హోలీ రోజు ఒకరిపై ఒకరు చల్లుకొని సెలబ్రేట్ చేసుకుంటారు.

ఎలాంటి హానీ ఉండదు..
మోదుగు పూలతో సహజసిద్ధంగా తయారు చేసిన రంగులతో ఎలాంటి హానీ ఉండదు. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే.. రసాయన రంగులతో చర్మ సంబంధిత వ్యాధుల వచ్చే ప్రమాదం ఉంది. అలాగే.. కళ్లు, చెవులు, ముక్కుకి సంబంధించిన అనేక రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. చిన్న పిల్లలు, వృద్దులు ఈ కెమికల్‌ కలర్స్‌కి దూరంగా ఉండటమే మంచిదని హెచ్చరిస్తున్నారు.

పురాతన కాలంలో పైసా ఖర్చు లేకుండా ఇలా గోగుపూలతో రంగులు తయారు చేసుకునేవారు. కానీ ఇప్పటి యువత రసాయనిక రంగులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. రానున్న రోజుల్లో మోదుగ పూలతో రంగులు తయారుచేయవచ్చనే విషయాన్ని కూడా మర్చిపొయే అవకాశం లేకపోలేదు. నేటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో రంగుల తయారీకి గోగుపూలను మాత్రమే వాడుతున్నారు.

మోదుగ చెట్టుకు మానవ మనుగడకు విడదీయలేని బంధం ఉంది. పండుగలకు, దేవుళ్లను పూజించడానికి అనేక విధాలుగా మోదుగచెట్టు ఉపయోగపడుతుంది. మోదుగ ఆకులతో విస్తరాకులు తయారు చేస్తారు. చెట్టు వేర్లు దాని నారతో తాళ్లు, వివిధ వస్తువులు తయారు చేస్తారు. మోదుగ పసరును ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు. మోదుగ కలపను హోమం కాల్చేప్పుడు వాడుతారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలుగా మోదుగు చెట్లు ఉపయోగపడతాయి.

బహుళ ప్రయోజనాలున్న మోదుగ చెట్టుతో పల్లె వాసులకు విడదీయలేని బంధం ఉంది. ఈ మోదుగ పూలు జనవరి నెల ఆరంభం నుంచి ఏప్రిల్ నెల ఆఖరు వరకు దొరుకుతాయి. ఈసారి ప్రతీ ఒక్కరూ మోదుగపూలతో చేసిన సహజసిద్ధ రంగులతోనే హోలీని జరుపుకుంటారని ఆశిద్దాం.

Holi 2024: హోలీని ఏ రాష్ట్రంలో ఎలా జరుపుకుంటారో తెలుసా?