Hot Sun : తెలంగాణలో రానున్న మూడు రోజులు తీవ్ర ఎండలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
రాష్ట్రంలోని 14 జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు వెల్లడించింది. గత 24గంటల్లో కరీంనగర్, జనగామ, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

Telangana Hot Sun
Telangana Hot Sun : తెలంగాణలో భానుడు భగభగ మండుతున్నాడు. సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే ఒక్కసారిగా ఎండ తీవ్రత పెరిగిపోయింది. మంచిర్యాల జిల్లా కొండాపూర్ లో ఆదివారం అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు ఎండల తీవ్రత మరింత పెరుగనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో 40-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వెల్లడించింది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు వెల్లడించింది. గత 24గంటల్లో కరీంనగర్, జనగామ, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
Hot Sun : ఏపీలో మండుతున్న ఎండలు.. తీవ్ర వడగాల్పులు
కొమురంభీం ఆసిఫాబాద్, కరీంనగర్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యపేట జిల్లాల్లో ఈ వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు.
కొన్ని రోజుల క్రితం వరకు పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగినా రాత్రిళ్లు మాత్రం చలిగాలులు వీచాయి. కానీ, ఇప్పుడు పగటి పూట తీవ్ర ఎండలు కొడుతున్నాయి. మధ్యాహ్నం, రాత్రి వేళ ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.