ఆన్‌లైన్ లోన్ యాప్స్ గుట్టు రట్టు…1100మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

identified microfinance apps and call centers : ప్రజలను పట్టి పీడిస్తున్న ఆన్‌లైన్ లోన్ యాప్స్ గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. మొత్తం మూడుచోట్ల మైక్రోఫైనాన్స్ యాప్స్ కాల్‌సెంటర్స్ గుర్తించారు. దేశ వ్యాప్తంగా మూడుచోట్ల పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట, బేగంపేటలో సీసీఎస్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఇక ఢిల్లీలోని గురుగ్రామ్‌లోనూ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. గురుగ్రామ్ కేంద్రంగా ఆన్‌లైన్ లోన్ యాప్స్ నడుస్తున్నట్టు గుర్తించారు. ఢిల్లీలో కాల్‌సెంటర్ ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. అందులో పనిచేస్తోన్న 400మంది ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు.
ఇటు హైదరాబాద్‌లోని రెండు కాల్‌సెంటర్లలో పనిచేస్తోన్న 700మందిని అదుపులోకి తీసుకున్నారు. బేగంపేట, పంజాగుట్టలోని కాల్‌సెంటర్స్‌పై పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. కాల్‌సెంటర్‌లో పనిచేస్తోన్న ఉద్యోగులను పోలీసులు ప్రశ్నిస్తోన్నారు. ప్రజలను పట్టిపీడిస్తున్న మైక్రోఫైనాన్స్ యాప్స్ వెనుక చైనా కంపెనీలు ఉన్నట్లు భావిస్తున్నారు.
ఆన్‌లైన్ లోన్ యాప్స్ కీచకపర్వానికి తెర తీస్తున్నాయి. వడ్డీకి డబ్బులు ఇచ్చినట్లే ఇచ్చి.. అవి రాబట్టేందుకు ఎంతకైనా తెగిస్తున్నాయి. లోన్ తీసుకున్న వారికి ఫోన్లు చేసి బెదిరిస్తున్నాయి. వారి బంధువులు.. తెలిసిన వారికి బెదిరింపులు తప్పవంటూ హెచ్చరిస్తున్నాయి.
తీసుకున్న డబ్బులు చెల్లించకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ.. లోన్ యాప్స్ నిర్వాహకులు హెచ్చరిస్తున్నారంటే.. వారి ఆగడాలు ఎంతవరకూ వెళ్లాయో వేరే చెప్పక్కర్లేదు. అత్యవసర పరిస్థితుల్లో తీసుకున్న చిన్న మొత్తానికే భారీ స్థాయిలో వేధింపులు వస్తుండటంతో.. అవి తట్టుకోలేక లోన్ తీసుకున్న వారు ఉసురు తీసుకుంటున్నారు.