Hydra Demolitions : హైదరాబాద్ మణికొండలో హైడ్రా కూల్చివేతలు.. ఆ విల్లాలు నేలమట్టం..
పోలీసుల బందోబస్తు నడుమ నిర్మాణాలను నేలమట్టం చేశారు అధికారులు.

Hydra Demolitions : రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ నెక్నంపుర్ వద్ద చెరువులో నిర్మిస్తున్న విల్లాలను హైడ్రా కూల్చి వేసింది. పెద్ద చెరువులోని ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ లలో వెలసిన విల్లాలకు అనుమతులను రద్దు చేశారు. అయినా, విల్లాల నిర్మాణాలు కొనసాగించడంపై హైడ్రా కమిషనర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గురువారం క్షేత్రస్థాయిలో అక్రమ కట్టడాలను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.
నోటీసులు పట్టించుకోకుండా విల్లాల నిర్మాణాలు..
మున్సిపాలిటీ, ఇరిగేషన్ అధికారుల నోటీసులను పట్టించుకోకుండా కొనసాగించడంపై కూల్చివేతలకు హైడ్రా కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇవాళ ఉదయమే అధికారులు జేసీబీతో అక్కడ వాలిపోయారు. పోలీసుల బందోస్తు నడుమ నిర్మాణాలను నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. రెండు విల్లాలకు సంబంధించి కోర్టు ఉత్తర్వులు ఉండటంతో కోర్టుకు సమాచారం ఇచ్చిన తర్వాతే కూల్చివేత చర్యలు చేపట్టింది హైడ్రా. పెద్ద చెరువులో మొత్తం 13 విల్లాలను నిర్మించారు.
ఒక్కో విల్లా 400 చదరపు గజాల్లో నిర్మాణం..
ఒక్కో విల్లాను 400 చదరపు గజాల్లో నిర్మాణం చేశారు. వీటన్నింటికి నోటీసులు ఇచ్చారు. అయినా, కూడా వాళ్లు అదే విధంగా నిర్మాణాలు చేస్తుండటంతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ విషయం హైడ్రా కమిషనర్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. పెద్ద చెరువు ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి 13 విల్లాలను కూల్చాలని నిర్ణయించారు. అయితే, రెండు విల్లాలు మాత్రం కోర్టు ఆదేశాలు ఉంటంతో వాటిని టచ్ చేయలేదు. మిగతా విల్లాలన్నింటిని కూలుస్తామని అధికారులు చెబుతున్న పరిస్థితి ఉంది.
Also Read : తెలంగాణ మంత్రులు అలిగారా? తమను చిన్నచూపు చూశారని అవమానంగా ఫీలవుతున్నారా?

Hydra Demolitions In Madhapur
ఇంకా నిర్మాణ దశలో ఉన్న విల్లాలు కూల్చివేత..
ఇప్పటివరకు కొన్ని నిర్మాణాలను కూల్చేశారు. మరికొన్ని నిర్మాణాల కూల్చివేతల పనులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా చెరువులో ఉండి నిర్మాణం జరుగుతున్న వాటిని కూల్చాలి. నిర్మాణం పూర్తై అందులో పబ్లిక్ నివాసం లేకుంటే మాత్రం వాటిని కూల్చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది.
ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పడం జరిగింది. వ్యాపారం చేస్తున్న సముదాయాలను, పబ్లిక్ నివాసం లేని నిర్మాణాలను కూల్చేస్తామన్నారు. మణికొండలో విల్లాలు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. దాంతో భారీ యంత్రాలతో వాటిని నేలమట్టం చేస్తున్నారు హైడ్రా అధికారులు.
Also Read : ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను సర్కారు స్వాధీనం చేసుకుంటుంది: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి