సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ ఈటల మధ్య వేడెక్కిన రాజకీయం.. ఎందుకంటే?
అప్పుడు ఈటల రేవంత్ సవాల్ ను స్వీకరించకుండా సైలెంట్ గానే ఉండిపోయారు.

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైందట. అందులోను సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మధ్య రచ్చ తారా స్థాయికి చేరుకుంది. సీఎం రేవంత్ పై ఈటల రెచ్చిపోయి మాట్లాడుతుంటే..అంతే స్థాయిలో కాంగ్రెస్ నేతలు సైతం ఈటలపై ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఈటల రాజేందర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య ఉన్న ఆ వైరమేంటని అంతా ఆరా తీస్తున్నారట. గతంలో వీళ్లిద్దరి మధ్య జరిగిన గొడవ గురించి సైతం చర్చించుకుంటున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మధ్య పొలిటికల్ వార్ పీక్ స్టేజీకి చేరుకుందన్న టాక్ రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది. సై అంటే సై అనుకునేంత రేంజ్ కి వీరిద్దరి మధ్య రాజకీయవైరం కొనసాగుతోందన్న టాక్ విన్పిస్తోంది. అయితే రేవంత్ వర్సెస్ ఈటల రాజేందర్..వీళ్లిద్దరి మధ్య వైరం ఈనాటిది కాదని..రెండేళ్ల క్రితం మునుగోడు ఎన్నికల సందర్బంగా ఇద్దరూ అమీతుమీకి దిగిన సందర్భాన్ని సైతం పార్టీవర్గాలు గుర్తుచేసుకుంటున్నాయట. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఇద్దరి మధ్య పరోక్షంగా మాటల యుద్ధం కొనసాగుతోంది.
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మొదటి నుంచి హైడ్రాపై ఫైర్ అవుతూనే ఉన్నారు. అయితే తాజాగా జరిగిన ఓ ఘటన నేపథ్యంలో ఆయన తీవ్ర స్థాయిలో మనస్థాపం చెందినట్లు బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల బాచుపల్లిలో పూజిత అపార్ట్ మెంట్ ను నిబంధనలకు విరుద్దంగా నిర్మించారని హైడ్రా నోటీసులు జారీ చేసింది. దీంతో అపార్ట్ మెంట్ వాసులు ఎంపీ ఈటల రాజేందర్ ను ఆశ్రయించాగా..తనకు ప్రభుత్వంలో కొంత సాన్నిహిత్యం ఉన్న మంత్రి శ్రీధర్ బాబుకు ఫోన్ చేసి విషయం చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు నచ్చజెప్పాలని కోరారని తెలుస్తోంది.
Also Read: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్… పెరిగిన ఛార్జీలు.. టికెట్ రేట్లు ఎలా ఉన్నాయంటే?
దీంతో మంత్రి శ్రీధర్ బాబు..హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫోన్ చేసి బాచుపల్లి పూజిత అపార్ట్ మెంట్ పై చర్యలు తీసుకునే విషయంలో మరోసారి ఆలోచించాలని రిక్కెస్ట్ చేశారట. అయితే మంత్రి శ్రీధర్ బాబు విన్నపాన్ని సైతం రంగనాధ్ పట్టించుకోలేదని, పైగా పూజిత అపార్ట్ మెంట్ విషయంలో హైడ్రాకు సంబంధం లేదని..స్థానిక తహశీల్థార్ నోటీసులు ఇచ్చారని, ఇలాంటి విషయాలు తన దగ్గరకు తీసుకురావద్దని పరోక్షంగా ఈటలను ఉద్దేశిస్తూ ఓ స్టేట్ మెంట్ కూడా ఇచ్చారని అంతా అనుకుంటున్నారట.
సందర్భం దొరికిన ప్రతిసారి ఇంతే..
ఎంపీ ఈటల రాజేందర్ కు ఎక్కడాలేని కోపం వచ్చిందట. మంత్రి శ్రీధర్ బాబు చెప్పినా పట్టించుకోని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కేవలం సీఎం రేవంత్ రెడ్డి చెబితేనే వింటారని భావించినట్లు తెలుస్తోంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా మాటల తూటాలను ఎక్కుపెట్టారట ఎంపీ ఈటల. సందర్భం దొరికిన ప్రతిసారి.. రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయి మాట్లాడటం మొదలుపెట్టారట ఈటల.
ఈ క్రమంలో గతంలో మునుగోడు ఎన్నికల సందర్భంగా తమ మధ్య జరిగిన సవాళ్ల సందర్భాన్ని సైతం గుర్తు చేసుకున్న ఈటల..చార్మినార్ అమ్మవారి ఆలయం దగ్గర కన్నీళ్లు పెట్టుకున్న రేవంత్ తో కొట్లాడబోనని, ధీరుడితో మాత్రమే తాను కొట్లాడతానని ఎద్దేవా చేశారట. అయితే ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి మౌనం వహించగా, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ సహా కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి లాంటి వాళ్లు తీవ్రస్థాయిలో స్పందించారు. ఈటల సీఎం రేవంత్ పై మాట్లాడే సందర్బంలో ఉపయోగిస్తున్న బాషకు ధీటుగా అంతే స్థాయితో మాట్లాడుతున్నారట.
రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ మధ్య గొడవలు ఈనాటివి కావని..సరిగ్గా రెండేళ్ల క్రితం 2023లో మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఇద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధాన్ని ఈ సందర్భంగా నేతలు గుర్తుచేసుకుంటున్నారు. అప్పుడు పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్..మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి లోపయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని, అందుకు కేసీఆర్ నుంచి రేవంత్ 25 కోట్లు తీసుకున్నాడని ఈటల ఆరోపించారు.
దీన్ని తీవ్రంగా ఖండించిన రేవంత్.. హైదరాబాద్ భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర తడి బట్టలతో ప్రమాణం చేద్దామని సవాల్ విసరడమే కాదు తడి బట్టలతో భాగ్యలక్ష్మి టెంపుల్ కు వెళ్లి తాను కేసీఆర్ నుంచి 25 కోట్లు తీసుకోలేదని ప్రమాణం కూడా చేశారు. అప్పుడు ఈటల రేవంత్ సవాల్ ను స్వీకరించకుండా సైలెంట్ గానే ఉండిపోయారు.
ఇలా సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ ఈటల రాజేందక్ ఎపిసోడ్ ఇంకా ఎంత కాలం కొనసాగుతుంది,..ఈ మాటల యుద్ధం ఎక్కడికి దారితీస్తుందో అన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఇప్పటికే తెలంగాణలో బీజేపికి చెక్ పెట్టాలని చూస్తున్న సీఎం రేవంత్..ఈటల విషయంలో ఎలాంటి అడుగులు వేస్తారో అనేది ఆసక్తికరంగా మారింది.