‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’కు వారంతా అనర్హులే..! భారీగా దరఖాస్తులు రిజక్ట్.. మళ్లీ కొత్తగా అప్లయ్ చేసుకోవాలా?
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 18,180 మంది ఖాతాల్లో రూ.6వేల చొప్పున ప్రభుత్వం నగదు జమ చేసింది. అయితే.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో..

Indiramma Atmiya Bharosa
Indiramma Atmiya Bharosa: రాష్ట్రంలో భూమిలేని వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం ప్రతీయేటా రూ.12వేలు ఆర్థిక సాయం అందించేందుకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని గతనెల 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకంలో అర్హత పొందాలంటే భూమి లేనివారై ఉండంతోపాటు 2023-24లో ఉపాధి హామీ పథకం కింద 20రోజుల పనిదినాలు పూర్తిచేసినవారై ఉండాలి. ఇప్పటికే భూమిలేని, ఉపాధి కూలీకి వెళ్తున్న పేద కుటుంబాలను ఎంపిక చేసిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో నగదు జమచేసే ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 18,180 మంది ఖాతాల్లో రూ.6వేల చొప్పున రూ.10.90 కోట్లకుపైగా నగదును జమ చేసింది. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మిగిలిన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ నిలిచిపోయింది.
Also Read: Ponguleti Srinivas Reddy : పంచాయతీ ఎన్నికలపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..
భారీగా అప్లికేషన్లు రిజక్ట్..
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షలకుపైగా లబ్ధిదారులు ఎంపికయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఐదారు జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో దరఖాస్తుల నమోదు ప్రక్రియ పూర్తయింది. ఈ పథకానికి 2,24,487 దరఖాస్తులు కొత్తగా వచ్చాయి. వాటిని పరిశీలించిన అధికారులు 19,193 దరఖాస్తులను పథకంకు అర్హత ఉన్నట్లు గుర్తించగా.. 1,44,784 అప్లికేషన్లు రిజెక్ట్ చేశారు. ఇంకా 49,542 దరఖాస్తులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 5,80,577 మందిని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. మరో 20 నుంచి 30వేల మంది అర్హుల జాబితాలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం కింద ఆరు లక్షలకుపైగా లబ్ధిదారులు ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియను మరో వారం రోజుల్లో పూర్తిచేయనున్నట్లు సమాచారం.
ఆటోమేటిక్ గా రిజక్ట్..
భూమి ఉండి ఉపాధి పనులకు వెళ్తున్న వారుసైతం ఈ పథకానికి దరఖాస్తులు చేసుకుంటుండం వల్లనే అధిక సంఖ్యలో దరఖాస్తులు రిజక్ట్ అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అప్లికేషన్ల నమోదు, అర్హుల వివరాలను ప్రత్యేక పోర్టల్ లో ఎంట్రీ చేస్తున్నారు. ఇందులో లబ్ధిదారుల పేరు, ఆధార్ కార్డు వివరాలు నమోదు చేయగానే.. వారిపేరు మీద భూమి ఉందా.. లేదా అనే వివరాలు తెలిసిపోతాయి.దీంతో ఎవరిపేరు మీద అయిన భూమి ఉంటే ఆటోమేటిక్ గా ఆ దరఖాస్తు రిజక్ట్ అవుతుంది.
Also Raed: దమ్ముంటే లగచర్ల రా.. లేదా నన్నే కొడంగల్ రమ్మంటావా?.. సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్
కుటుంబంలో ఎవరికి భూమి ఉన్నా అనర్హులే..
జాబ్ కార్డు కలిగిన కుటుంబంలో ఏ ఒక్కరి పేరుమీద సెంటు భూమి ఉన్నా వారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంకు అనర్హులుగా అధికారులు పేర్కొంటున్నారు. కుటుంబ యాజమానికి భూమి లేకుండా ఇతర కుటుంబ సభ్యులపై సెంటు భూమి ఉన్నా వారినీ లిస్ట్ నుంచి తొలగిస్తున్నారు. అయితే, ఇక్కడ అర్హత ఉన్నవారిని కొత్త సమస్య వేధిస్తోంది. వాస్తవానికి వారి పేరుమీద, కుటుంబ సభ్యుల పేరుమీద సెంటు భూమి లేకున్నా.. గతంలో భూమి ఉండి అమ్ముకున్నప్పటికీ రికార్డుల్లో కొందరి పేర్లు అలాగే వస్తున్నాయి. దీంతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హత ఉన్నప్పటికీ వారి పేర్లును రిజక్ట్ చేస్తున్నారు. ఈ సమస్యపై అధికారులకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. ఇలాంటి వారు తహసీల్దార్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి, భూమి విక్రయించినా రెవెన్యూ రికార్డుల్లో పేరు అలాగే ఉండటానికి గల కారణాలు సర్టిఫై చేసి వివరాలు ఎంపీడీవోకు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత ఎంపీడీవో అర్హులని ధ్రువీకరిస్తే వారికి పథకం ఫలాలు అందే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులు ఆ మేరకు పెద్దగా దృష్టి పెట్టకపోవటంతో అర్హత ఉన్న చాలా మంది పథకానికి దూరమవుతున్నారు. మరోవైపు కుటుంబంలో ఒక్కరికే పథకం ఫలాలు అందుతాయి. ఈ క్రమంలో కుటుంబంలో ఇద్దరు అర్హులు ఉంటే వారిలో పెద్దవారికి అకౌంట్లలో నగదు జమ అవుతుంది. అర్హులై ఉండి భార్య చనిపోతే భర్తకు, ఆ కుటుంబంలో ఏ సభ్యుడు ఉన్నా వారి పేరున నగదు జమ చేయనున్నారు.