KTR: స్థానిక సంస్థల్లో ఏకగ్రీవానికి ఇలా కుట్రలు చేస్తున్నారు: కేటీఆర్ సంచలనం

కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో మోసపోయామని అనుకోని వర్గం ఏది ఈ రాష్ట్రంలో లేదని కేటీఆర్ తెలిపారు.

KTR: స్థానిక సంస్థల్లో ఏకగ్రీవానికి ఇలా కుట్రలు చేస్తున్నారు: కేటీఆర్ సంచలనం

KTR

Updated On : February 11, 2025 / 4:11 PM IST

తెలంగాణలోని ప్రతి వర్గాన్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే అవకాశం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉందని బీఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు స్థానిక సంస్థల్లో ఏకగ్రీవానికి కుట్రలు చేస్తున్నారని తెలిపారు.

ఖమ్మంలో కేటీఆర్ తమ పార్టీ నేతలతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఖమ్మం జిల్లాలోని ప్రత్యేక రాజకీయ సమీకరణాల వల్ల తమ పార్టీకి కొంత నష్టం జరిగిందని తెలిపారు.

తమ పార్టీ ఓటమిపాలైనప్పటికీ ప్రజలకు కష్టం వస్తే తమ నాయకులు ప్రజలకు అండగా ఉంటున్నారని చెప్పారు. ఖమ్మంలో వరదలు వస్తే ప్రజలకు పువ్వాడ అజయ్ గుర్తుకొచ్చారని తెలిపారు.

Also Read: ఓర్నీ.. నిర్మలా సీతారామన్ ఇన్‌కం ట్యాక్స్ మీద అంత పెద్ద ప్రకటన చేస్తే… ఆర్థిక వ్యవస్థ పెరిగేది ఇంతేనా.. షాకింగ్ రిపోర్ట్

డిప్యూటీ సీఎంతో కలిపి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా కానీ వరదల సమయంలో వాళ్లతో పైసా ఉపయోగం లేదని చెప్పారు. ఒక కుటుంబం వరద నీళ్లలో చిక్కుకుంటే కనీసం హెలికాప్టర్ తెప్పించి కాపాడాలన్న సోయి మంత్రులకు రాలేదని అన్నారు.

ఎమ్మెల్యేల పుట్టినరోజులకు ఇంకా వేరే పనికిమాలిన పనులకు మంత్రులు హైదరాబాద్ నుంచి కూతవేటు దూరానికి కూడా హెలికాప్టర్లలో పోతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో వరదలు వచ్చినప్పుడు భూపాలపల్లి జిల్లాలోని మారుమూల గ్రామాలకు కూడా నాలుగు హెలికాప్టర్లను పంపి ప్రజలను కాపాడామని, తమకు ప్రాణం విలువ తెలుసని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో మోసపోయామని అనుకోని వర్గం ఏది ఈ రాష్ట్రంలో లేదని తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేకపోయేసరికి ఎంతో నష్టపోయామన్న భావనలో తెలంగాణలోని ప్రతి ఒక్కరూ ఉన్నారని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నియోజకవర్గంలోని పనులతో పాటు తెలంగాణలోని ప్రతి పని కాంట్రాక్టు కూడా ఇప్పుడు ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రికే దక్కుతుందని చెప్పారు. డిప్యూటీ సీఎం 30 శాతం కమిషన్లు తీసుకొని పనులు చేస్తున్నారని సొంత పార్టీ ఎమ్మెల్యేనే చెబుతున్నారని అన్నారు. బీసీ సోదరులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.