కేసీఆర్ వస్తారు.. రేవంత్ రెడ్డిని చూసి జాలిపడుతున్నా.. : కేటీఆర్

KTR
KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ సోమవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. 2014లో దాసోజు శ్రవణ్ బీఅర్ఎస్ ను వదిలి వెళ్లకపోతే అప్పుడే ఎమ్మెల్సీ అయ్యేవారు. 2023లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే బీజేపీ అడ్డుకుంది. కేసీఆర్ మాటఇస్తే దానికి తిరుగు ఉండదు. దాసోజుకు కేసీఆర్ మళ్లీ అవకాశం ఇచ్చారని కేటీఆర్ అన్నారు.
Also Read: Dasoju Sravan Kumar : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్
రేవంత్ రెడ్డి మాట ఢిల్లీలో చెల్లుబాటు కావడంలేదని మరోసారి రుజువైందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆయన మనుషులకు ఎమ్మెల్సీ పదవి ఇప్పించుకోలేకపోయాడు. రేవంత్ రెడ్డిని చూసి జాలిపడుతున్నా. రేవంత్ రెడ్డి పేరుకే ముఖ్యమంత్రి.. అధికారం మాత్రం లేదు అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని కేటీఆర్ అన్నారు. ఈ-కార్ రేసు కేసు విచారణకు మళ్లీ నన్ను పిలుస్తారు. బడ్జెట్ సమావేశాల నుంచి దృష్టి మళ్లించేందుకు నాకు నోటీసులు ఇస్తారు. ఈనెల 16 నుంచి 27లోపు నన్ను విచారణకు పిలుస్తారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ అంత మంచోడిని నేను కాదంటూ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఆడించే కీలు బొమ్మలను మేము వదిలిపెట్టం. కేసీఆర్ అంత మంచోడిని నేను కాదు. విచ్చలవిడిగా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులతో ఫోన్లను హ్యాక్ చేస్తున్నారంటూ కేటీఆర్ ఆరోపించారు.