KTR: కేసీఆర్‌ను పొన్నాల కలుస్తారన్న కేటీఆర్.. కాంగ్రెస్‌లో అవమానాన్ని భరించలేకపోయానంటూ పొన్నాల కామెంట్స్

చచ్చే ముందు పార్టీ మారడం ఏంటంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం సరికాదని కేటీఆర్ చెప్పారు.

KTR: కేసీఆర్‌ను పొన్నాల కలుస్తారన్న కేటీఆర్.. కాంగ్రెస్‌లో అవమానాన్ని భరించలేకపోయానంటూ పొన్నాల కామెంట్స్

KTR

Updated On : October 14, 2023 / 4:33 PM IST

Ponnala Lakshmaiah: మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించామని, ఆదివారం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుస్తారని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ సూచనలతో పొన్నాలకు ఆహ్వానం పలికామని చెప్పారు. బీఆర్ఎస్‌లో చేరికపై ఆదివారం స్వయంగా పొన్నాల లక్ష్మయ్య స్పష్టతనిస్తారని అన్నారు.

బీఆర్ఎస్‌లో సీనియర్ నేతలకు పెద్దపీట వేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. పొన్నాలకు బీఆర్ఎస్‌లో తగిన ప్రాధాన్యం ఇస్తామన్నారు. వయసులోనూ పెద్ద అయిన పొన్నాల లక్ష్మయ్యను కాంగ్రెస్ లో తూలనాడారని చెప్పారు. సీనియర్ నాయకుడైన పొన్నాల లక్ష్మయ్య పట్ల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు.

బలమైన బీసీ నాయకుడు అని కూడా చూడకుండా పొన్నాల లక్ష్మయ్యపై రేవంత్ రెడ్డి ప్రదర్శించిన తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. రేవంత్ ఎన్ని పార్టీలు మారారని, కాంగ్రెస్ వైఖరి ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో సీనియర్లను అవమానిస్తున్నారని అన్నారు. చచ్చే ముందు పార్టీ మారడం ఏంటంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ అని విమర్శించారు. డబ్బు సంచులకు సీట్లను అమ్ముకుంటున్నారని ఆరోపించారు.

45 ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్నా..

అనంతరం పొన్నాల మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. కాంగ్రెస్ కికి తాను చేసిన సేవలను కనుమరుగు చేశారని వాపోయారు. తాను 45 ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్నానని చెప్పారు. రేవంత్ లాంటి వాళ్లు కాంగ్రెస్ లోకి వచ్చి ఆ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్య స్థితిలో ఉందని చెప్పారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చాక ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఎందుకు ఓడిపోయిందని నిలదీశారు. అవమానాన్ని భరించలేక తాను బయటకి వచ్చానని చెప్పారు.

Bandi Sanjay: చేపల పులుసే కొంప ముంచింది: బండి సంజయ్