Ktr: హరీశ్ రావుకి సిట్ నోటీసులు.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్
తమపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టి, ఎన్ని వేధింపులకు గురి చేసినా ప్రజల పక్షాన మిమ్మల్ని వేటాడటం ఆపేది లేదన్నారు.
KTR Representative Image (Image Credit To Original Source)
- సుప్రీంకోర్టు కొట్టేసిన కేసుతో మళ్లీ డ్రామా
- బావమరిది స్కామ్ బయటపడటంతో రేవంత్ లో వణుకు
- రాజకీయ వేధింపులే కాంగ్రెస్ పార్టీ ఏకైక అజెండాగా మారిపోయింది
Ktr: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావుకి సిట్ నోటీసులు ఇచ్చిన అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పస లేదని సుప్రీంకోర్టు కొట్టి వేసిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతోనే ఈ డ్రామా ముగిసిపోయినా మళ్లీ నోటీసులు ఇవ్వడం రేవంత్ సర్కార్ దిగజారుడుతనానికి నిదర్శనం అని విరుచుకుపడ్డారు.
రేవంత్ రెడ్డి బావ మరిది సుజన్ రెడ్డికి బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణాన్ని బయట పెట్టినందుకే, దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించే డైవర్షన్ పాలిటిక్స్ తప్ప.. మరొకటి కాదంటూ మండిపడ్డారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుండటంతో రేవంత్ కి వణుకు పుడుతోందన్నారు. రాజకీయంగా హరీశ్ రావుని ఎదుర్కోలేక ఇలాంటి తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.
ఏడాదిగా ఈ దారుణమైన పాలనను నిలదీస్తున్నందుకే హరీశ్ రావుని టార్గెట్ చేస్తూ ఈ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, మాకు చట్టం పైన, న్యాయస్థానాలపైన పూర్తి గౌరవం ఉందని.. అందుకే ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కానీ విచారణలు, నోటీసుల పేరుతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తే అది మీ భ్రమ మాత్రమే అని చెప్పారు.
తమపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టి, ఎన్ని వేధింపులకు గురి చేసినా ప్రజల పక్షాన మిమ్మల్ని వేటాడటం ఆపేది లేదన్నారు. మీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని, అడుగడుగున ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఇలాంటి చౌకబారు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పారు కేటీఆర్.
రాజకీయ వేధింపులే కాంగ్రెస్ పార్టీ ఏకైక అజెండాగా మారిపోయింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పస లేదని, అది కేవలం రాజకీయ కక్ష సాధింపు అని సాక్షాత్తూ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడమే కాకుండా కేసును కూడా కొట్టేసింది.
అత్యున్నత న్యాయస్థానం తీర్పుతోనే ఈ డ్రామా ముగిసిపోయినా, మళ్లీ…
— KTR (@KTRBRS) January 19, 2026
