అందరికీ అవినీతి మరకలు అంటించాలని రేవంత్ ప్లాన్: కేటీఆర్
ఇప్పటిదాకా తొమ్మిది సింగరేణి టెండర్లను ముఖ్యమంత్రి కుటుంబం నియంత్రించిందని కేటీఆర్ ఆరోపించారు.
KTR, Revanth Reddy (Image Credit To Original Source
- రేవంత్‌కు డబ్బుల కట్టలతో దొరికిన నేరచరిత్ర ఉంది
- బాధ్యతాయుతమైన నాయకుడిగా హరీశ్ విచారణకు హాజరు
- అడ్డగోలు సిట్ విచారణల పేరుతో కాంగ్రెస్ తమాషాలు
KTR: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డబ్బుల కట్టలతో దొరికిన నేరచరిత్ర ఉందని, అదే విధంగా అందరికీ అటువంటి మచ్చను అంటించాలని చూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.
“బాధ్యతాయుతమైన నాయకుడిగా హరీశ్ రావు ఇవాళ విచారణకు హాజరయ్యారు. అడ్డగోలు సిట్ విచారణల పేరుతో ఎన్ని రకాల తమాషాలు చేసినా కాంగ్రెస్ పార్టీ హామీల వైఫల్యం, పరిపాలన వైఫల్యంపై ప్రశ్నిస్తూనే ఉంటాం. అధికారం అందలం ఎక్కిచ్చినప్పటికీ రేవంత్ రెడ్డి బుద్ధి మాత్రం బురదలోనే ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్ గ్రేస్.
ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఒక్క అధికారి కూడా ఇప్పటిదాకా ఎందుకు బయట మాట్లాడలేదు? కేవలం లీకులు ఇచ్చి ఎన్ని రోజులు ఇలా బతుకుతారు? ఎలాంటి ఆధారాలు లేకుండా, అధికారిక సమాచారం లేకుండా ఎన్ని రోజులు ఈ తమాషాలు నడిపిస్తావు రేవంత్ రెడ్డి? అసలు ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఒక్క అధికారిక ప్రకటన రాలేదు.
గతంలో హరీశ్ రావుపై నమోదైన అక్రమ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. హరీశ్ రావు బొగ్గు కుంభకోణంలో బయటపెట్టిన సమాచారం తప్పయితే సంబంధిత మంత్రి, సింగరేణి అధికారులు ఇప్పటిదాకా ఒక్కరూ ఎందుకు మాట్లాడలేదు? కాంగ్రెస్ కుంభకోణాలను బయటపెట్టిన ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం అటెన్షన్ డైవర్షన్ పనులు చేస్తోంది” అని అన్నారు.
అంచనా విలువకన్నా అధికంగా టెండర్లు..
ఇప్పటిదాకా తొమ్మిది సింగరేణి టెండర్లను ముఖ్యమంత్రి కుటుంబం నియంత్రించిందని కేటీఆర్ ఆరోపించారు. “గతంలో ఎప్పుడూ లేనివిధంగా మైనస్ టెండర్లు పడే చోట అంచనా విలువకన్నా అధికంగా టెండర్లు వేశారు. సింగరేణిని ఒక బంగారు బాతులాగా చూసి దీని నుంచి నిధులు, డబ్బులు కొల్లగొట్టేందుకు ఒక నిబంధన తీసుకువచ్చారు. టెండర్లు వేసిన కంపెనీ కచ్చితంగా సైట్ విజిట్ చేయాలి అన్న నిబంధన దేశంలో ఎక్కడా లేనివిధంగా పెట్టారు.
సింగరేణి అధికారుల నుంచి సైట్ విజిట్ సర్టిఫికెట్ తీసుకోవాలి. సైట్ విజిట్‌కు వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కంపెనీ సమాచారం, ఆ కంపెనీ డైరెక్టర్ల సమాచారం తీసుకుని బెదిరింపులకు దిగారు. మొత్తం సింగరేణి అంశంలో సీఎం రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డి ప్రధాన ముద్దాయి. ఈ సింగరేణి దొంగతనంలో బీజేపీకి వాటాలు లేకుంటే ఎందుకు స్పందించడం లేదు?
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా బాధ్యత తీసుకోవాలి. కేంద్రం-రాష్ట్రం భాగస్వాములుగా ఉన్న సింగరేణికి తీవ్రమైన ఆర్థిక నష్టం జరుగుతున్నప్పుడు ఎందుకు మౌనంగా కిషన్ రెడ్డి ఉన్నారు? కేంద్ర కోల్ శాఖ మంత్రి కిషన్ రెడ్డికి కూడా ఇందులో వాటాలు ఉన్నాయి అని అనుకోవాలి” అని అన్నారు.
