హైదరాబాద్‌లో లాక్‌డౌన్, నేడు సీఎం కేసీఆర్ నిర్ణయం

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన నేడు(జూలై 1,2020) కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా కట్టడి కోసం హైదరాబాద్ లో లాక్ డౌన్ విధిస్తారని తెలుస్తోంది. అలాగే పలు కీలక నిర్ణయాలు ఈ భేటీలో తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. లాక్‌డౌన్‌ను దృష్టిలో పెట్టుకునే ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ మంగళవారం(జూన్ 30,2020) రోజంతా పలువురు మంత్రులు, నేతలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులతో చర్చించి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
లాక్ డౌన్ పై అధికారిక ప్రకటన:
రాష్ట్రంలో ఇప్పటివరకు అమల్లో ఉన్న లాక్‌డౌన్ గడువు మంగళవారంతో(జూన్ 30,2020) ముగిసింది. కేంద్రం కూడా అన్‌లాక్ 2పై విధివిధానాలను వెల్లడించింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవలసి ఉంది. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శతజయంతి సందర్భంగా ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని, పార్లమెంటులో చిత్రపటం ఏర్పాటుచేయాలని, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం, రాష్ట్ర ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన ఇతరత్రా నిర్ణయాలపైనా మంత్రిమండలిలో తీర్మానాలు చేయాల్సి ఉంది. వీటన్నింటి కోసమైనా కేబినెట్ సమావేశం జరగాల్సి ఉంది. ఈ విషయంలో బుధవారం సీఎం నిర్ణయం వెలువడే వీలుందని సమాచారం.
స్వచ్ఛంద లాక్‌డౌన్‌లు:
ప్రభుత్వ నిర్ణయం రాకముందే రాష్ట్రంలోని పలు కాలనీల్లో ప్రజలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌కు ముందుకొస్తున్నారు. కిరాణా దుకాణాలు, వ్యాపార సంస్థలు ఇప్పటికే వేళలను కుదించేశాయి. కొన్నిచోట్ల వ్యాపారులు పూర్తి బంద్ పాటిస్తున్నారు.
గ్రామాలకు పయనం:
జీహెచ్‌ఎంసీ పరిధిలో లాక్‌డౌన్ ఉంటుందన్న ప్రచారం ఇప్పటికే జోరుగా సాగుతోంది. కరోనా నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేస్తామని స్వయంగా సీఎం కేసీఆరే ప్రకటించడంతో ఆ ప్రచారం ఊపందుకుంది. లాక్‌డౌన్‌కు అందరినీ సిద్ధం చేయాలంటూ ఉన్నతస్థాయి సమావేశంలో ఇటీవల కేసీఆర్ తెలిపారు. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కఠినంగా కట్టడి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధిస్తారన్న ప్రచారంతో ఇప్పటికే కొందరు సొంత గ్రామాలకు తరలివెళ్తున్నారు. దీంతో టోల్‌గేట్ల దగ్గర వాహనాల రద్దీ భారీగా పెరిగిపోయింది.
రాష్ట్రంలో 16వేలు దాటిన కరోనా కేసులు:
తెలంగాణలో కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం(జూన్ 30,2020) ఒక్కరోజులోనే పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 945 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,339కు చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 8785. గత 24 గంటల్లో 1,712 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 7,294కు చేరింది. ఇక మంగళవారం మరో ఏడుగురు వ్యక్తులు కరోనాతో చనిపోగా, మొత్తం మరణాల సంఖ్య 260కి చేరింది.
మంగళవారం రోజు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున కేసులు రికార్డ్ అయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే భారీగా రికార్డు స్థాయిలో 869 కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉంది. అక్కడ 29 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాలో 21 కొత్త కరోనా కేసులను గుర్తించారు. దాని తర్వాతి స్థానంలో మేడ్చల్ జిల్లా ఉంది. ఇక్కడ 13 కేసులు నమోదయ్యాయి.
GHMCలో 800కుపైగా కరోనా కేసులు నమోదు కావడం ఇది 4వ సారి:
కొన్ని రోజులుగా గ్రేటర్ పరిధిలో నమోదవుతున్న కేసుల సంఖ్య తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటివరకు 12వేల 863 కేసులు నమోదయ్యాయి. కాగా జీహెచ్ఎంసీ పరిధిలో 800కుపైగా కరోనా కేసులు నమోదు కావడం ఇది 4వ సారి. దీంతో మహా నగరంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. కరోనాను కట్టడి చేయాలంటే జీహెచ్ఎంసీ పరిధిలో మరోసారి అత్యంత కఠినంగా లాక్ డౌన్ విధించాలనే యోచనలో ఉంది.