Sridhar Babu: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు పెడితే తప్పేంటి- సీఎం వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు రియాక్షన్

బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ ఉధ్యోగులకు మూడో వారంలో జీతాలు ఇచ్చేవారు. బీఆర్ఎస్ చేసిన ఘనకార్యానికి అప్పులు వచ్చే పరిస్థితి లేదని సీఎం చెప్పారు.

Sridhar Babu: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు పెడితే తప్పేంటి- సీఎం వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు రియాక్షన్

Updated On : May 6, 2025 / 7:01 PM IST

Sridhar Babu: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. సీఎం చేసిన కామెంట్స్ లో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు పెడితే తప్పేంటని మంత్రి శ్రీధర్ బాబు నిలదీశారు.

సీఎం రేవంత్ రెడ్డి ముక్కు సూటి మనిషి అని, విషయాన్ని కుండబద్దలు కొట్టారని ఆయన చెప్పారు. సీఎం చేసిన వ్యాఖ్యలతో కొంతమందికి ఇబ్బంది కలగొచ్చు, కానీ అదే వాస్తవం అని తేల్చి చెప్పారు. కొంతమంది ప్రభుత్వాన్ని బెదిరించినట్లుగా కామెంట్స్ చేశారు, దాంతో సీఎం రేవంత్ ఆవేదనతో అలా మాట్లాడారని వివరించారు.

”ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో అందరూ సహకరించండని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ ఉధ్యోగులకు మూడో వారంలో జీతాలు ఇచ్చేవారు. బీఆర్ఎస్ చేసిన ఘనకార్యానికి అప్పులు వచ్చే పరిస్థితి లేదని సీఎం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు పెడితే తప్పేంటి? ఎట్టి పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు ఆపే ప్రసక్తే లేదు. ఆర్టీసీ ఉధ్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్నారు, అందుకే సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్, సెక్రటేరియట్ లో రివ్యూ చేస్తే వర్క్ ఫ్రం హోం ఎలా అవుతుంది?

Also Read: తెలంగాణ ఆర్టీసీ సమ్మె వాయిదా.. ఇది తాత్కాలికమే అన్న జేఏసీ.. సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ..

హెలికాప్టర్ ను ప్రభుత్వం హైర్ చేసింది. మంత్రి ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు కారులో కంటే హెలికాప్టర్ లో ఖర్చు తక్కువ. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే హెలికాప్టర్ ను హైర్ చేశారు. వాడినా వాడకున్నా డబ్బు కట్టాల్సిందే. ఊరికే డబ్బులు కట్టడం కంటే.. వాడడం మంచిది.

అందాల పోటీలు ప్రపంచంలో చాలా చోట్ల జరిగాయి. హైదరాబాద్ లో చేస్తామంటే ఎందుకు వద్దంటాం. హైదరాబాద్ ఇమేజ్ పెరుగుతుంది. జనజీవన స్రవంతిలోకి మావోయిస్టులు వచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. శాంతి చర్చలు కోరడం తప్పు కాదు” అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

దొంగల్లా చూస్తున్నారు- రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని ఆయన వాపోయారు. తెలంగాణకు అప్పు పుట్టడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అప్పు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. అప్పు కోసం ప్రభుత్వ అధికారులు బ్యాంకర్లను కలవడానికి వెళితే దొంగలను చూసినట్లు చూస్తున్నారని వాపోయారు. మన వాళ్లు ఎవరైనా ఢిల్లీకి వెళితే కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని, చెప్పులు కూడా ఎత్తుకు వెళతారేమో అన్నట్లుగా తెలంగాణ ప్రతినిధులను చూస్తున్నారని సీఎం రేవంత్ అన్నారు.

ఉద్యోగ సంఘాల డిమాండ్లపై సీఎం రేవంత్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వంపై సమరం అని ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతున్నారు.. ఎవరిపై మీ సమరం, ప్రజలపైనా మీ సమరం అంటూ విరుచుకుపడ్డారు. ప్రభుత్వం అంటే తాము ఒక్కరమే కాదని, అందరూ కుటుంబ సభ్యులే అని చెప్పారు.