Miss world 2025: ఇదేం సంప్రదాయం.. అందగత్తెల కాళ్లు కడిగిస్తారా..? వివాదాస్పదం అవుతున్న ప్రభుత్వ నిర్ణయం..!

సంప్రదాయం పేరుమీద గిరిజనులతో, దళితులతో అందగత్తెల కాళ్లు కడిగిస్తారా..? ఎస్సీ మోర్చ జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ ప్రశ్నించారు.

Miss world 2025: ఇదేం సంప్రదాయం.. అందగత్తెల కాళ్లు కడిగిస్తారా..? వివాదాస్పదం అవుతున్న ప్రభుత్వ నిర్ణయం..!

Miss world 2025

Updated On : May 15, 2025 / 2:22 PM IST

Miss world 2025: హైదరాబాద్‌ కేంద్రంగా ప్రపంచ సుందరీమణుల పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పోటీల్లో పాల్గొంటున్న అందగత్తెలు బుధవారం వరంగల్‌ జిల్లాలో పర్యటించారు. 20 దేశాలకు చెందిన అందాల భామలు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయ సందర్శనకు వెళ్లారు. విదేశీ మహిళలంతా తెలంగాణ సంప్రదాయం ప్రకారం కట్టు, బొట్టుతో సందడి చేశారు. వారంతా గుడిలోకి వెళ్లేముందు కాళ్లు కడుక్కునేందుకు నిర్వాహకులు కుర్చీలు, ఇత్తడి తాంబాలాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ మహిళలు వాళ్లకు ఇత్తడి చెంబుల్లో నీళ్లు అందించారు. ఆ తరువాత కాళ్లు తడుచుకోవటానికి టవల్ ఇచ్చారు. ఈ క్రమంలో ఓ మహిళ ఓ సుందరీమణి కాళ్లు తుడవడం వివాదంగా మారింది.

 

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు విమర్శిస్తున్నారు. ‘మన సంప్రదాయం చూపించాలంటే కాళ్లు కడిగి తుడవడం ఏమిటి?. ఇదేం మర్యాద?’ అని ప్రశ్నిస్తున్నారు. ఎస్సీ మోర్చ జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ మాట్లాడుతూ.. అందాల పోటీల నిర్వహణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోయిలేకుండా వ్యహరిస్తున్నాడంటూ విమర్శించారు. సంప్రదాయం పేరుమీద గిరిజనులతో, దళితులతో అందగత్తెల కాళ్లు కడిగిస్తారా..? అంటూ ప్రశ్నించారు. కాళ్లు కడిగించడం సిగ్గుమాలిన పని.. సుందరీమణుల కాళ్లు కడిగించి దళితుల, గిరిజనుల ఆత్మ గౌరవాన్ని రేవంత్ రెడ్డి అవమానించారని, అగౌరవ పరిచారంటూ విమర్శించాడు. ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని, తెలంగాణ సంప్రదాయం అంటే ఇదా..? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

 

మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. అందాల పోటీలకు బీజేపీ వ్యతిరేకం కాదు.. కానీ, రైతు సమస్యలను కూడా పట్టించుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ద రైతుల పైన లేదని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా తడిసిన ధాన్యం కనపడుతుందని, రైతులను గాలికి వదిలేసి అందాల పోటీలపైన పడ్డారంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.