ఢిల్లీ పెద్దలతో చర్చల తర్వాత జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. వారు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ను అంతం చేయాలని చేసిన ప్రయత్నాలు అందరూ చూశారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్య పద్దతిలో వ్యవహరిస్తోంది.

ఢిల్లీ పెద్దలతో చర్చల తర్వాత జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Jeevan Reddy : ఢిల్లీలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, కేసీ వేణుగోపాల్ తో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి భేటీ ముగిసింది. కాంగ్రెస్ పెద్దల బుజ్జగింపుతో జీవన్ రెడ్డి అలకవీడారు. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి ప్రాధాన్యత, తగిన గౌరవం ఉంటుందని కేసీ వేణుగోపాల్ హామీ ఇచ్చారని జీవన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తామన్నారాయన.

పార్టీనే ముఖ్యం- జీవన్ రెడ్డి
మారుతున్న రాజకీయ పరిణామాలు, పరిస్థితుల కారణంగా పార్టీలో కొన్ని నిర్ణయాలు తప్పవు. మొదటి నుంచి ఉన్న వారికి ప్రాధాన్యత, గౌరవం ఇస్తామని కేసీ వేణుగోపాల్ హామీ ఇచ్చారు. కార్యకర్తలను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఏ పార్టీకైనా కార్యకర్తలే ముఖ్యం. వారి ఆలోచనలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకోవాలి. లోక్ సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయి. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నా. రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేస్తుంది. బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో రుణమాఫీ చెయ్యలేదు. కానీ కాంగ్రెస్ ఏకకాలంలో అమలు చేయడం సంతోషకరం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా అమలుకాని పథకాలను తెలంగాణలో కాంగ్రెస్ అమలు చేస్తోంది. ఐక్యంగా కలిసి పని చేయాలని అధిష్టాన పెద్దలు సూచించారు.

దీపాదాస్ మున్షి- తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్
పార్టీలో చేరికలకు డోర్లు తెరిచే ఉన్నాయి. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి ప్రాధాన్యత తగ్గకుండా చూస్తాం. పీసీసీ పదవీకాలం ముగింపు అంటూ ఏమీ లేదు. పీసీసీపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. వన్ రెడ్డి పార్టీలో సీనియర్ నేత. ఆయనను కించపరచడం మా ఉద్దేశ్యం కాదు. జగిత్యాల ఎమ్మెల్యే చేరిక వల్ల ఆయన అమర్యాదగా, అగౌరవంగా భావించారు. కేసీ వేణుగోపాల్ తో చర్చలు జరిపాము. ఇకపై ఏ నిర్ణయం తీసుకున్నా ఆయనతో చర్చించే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది- మంత్రి శ్రీధర్ బాబు
పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. వారు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ను అంతం చేయాలని చేసిన ప్రయత్నాలు అందరూ చూశారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్య పద్దతిలో వ్యవహరిస్తోంది.

జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడం ఆ పార్టీలో చిచ్చు రాజేసిన సంగతి తెలిసిందే. సంజయ్ చేరికను జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. వారిద్దరూ చాలా కాలంగా ప్రత్యర్థులుగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తనతో కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండానే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడాన్ని జీవన్ రెడ్డి తప్పుపట్టారు. సంజయ్ చేరికతో తీవ్ర మనస్తాపం చెందిన జీవన్ రెడ్డి.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటూ అలకపాన్పు ఎక్కారు. దీంతో కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు. జీవన్ రెడ్డిని బుజ్జగించారు. వారి ప్రయత్నాలు ఫలించాయి. జీవన్ రెడ్డి అలకవీడారు.

Also Read : 33 మందిలో చివరికి మిగిలేది ఎంతమంది? గులాబీ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కాంగ్రెస్