Telangana : జూన్ రెండో వారం దాటినా.. ఇంకా మండిపోతున్న ఎండలు, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎందుకిలా?
Telangana : తెలంగాణలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. జూన్ రెండో వారం దాటినా.. ఇంకా రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Telangana Heat Waves
Telangana – Heat Waves : మే నెల ముగిసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుతుపవనాలు వచ్చేశాయి. జూన్ రెండో వారం దాటుతోంది. అయినా, ఇంకా ఎండలు మండిపోతూనే ఉన్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రికార్డు స్థాయిలో పగటి పూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మాడు పగిలే ఎండలతో, తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు.
తెలంగాణలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. జూన్ రెండో వారం దాటినా.. ఇంకా రాష్ట్రంలో భానుడు సెగలు కక్కుతున్నాడు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మేర రికార్డ్ అవుతున్నాయి. అటు, వర్షాలు కూడా పడటం లేదు. దీంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అసలు ఎందుకీ పరిస్థితి ఉంది? ఇంకా ఎందుకు ఎండలు మండిపోతున్నాయి? ఇంకా ఎన్ని రోజులు ఈ బాధ భరించాలి? వర్షాలు ఎప్పుడు పడతాయి? ఇప్పుడీ ప్రశ్నలు ప్రజలను వేధిస్తున్నాయి.(Telangana)
తెలంగాణలో నెలకొన్న ఈ పరిస్థితులపై వాతావరణ శాఖ అధికారులు స్పందించారు. తెలంగాణలో ఎండలు మండిపోవడానికి కారణం ఏంటో చెప్పారు. నైరుతి రుతుపవనాల రాక ఆలస్యంతోనే ఎండలు మండిపోతున్నాయని, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 15 నాటికి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశిస్తాయని చెప్పారు. రుతుపవనాలు ఎంటర్ కాగానే వాతావరణంలో మార్పులు వస్తాయని, ఎండలు తగ్గుతాయని వెల్లడించారు. అప్పటివరకు ఈ బాధ భరించాల్సిందే అన్నారు.
ఈసారి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయి. జూన్ మొదటి వారంలోనే కేరళను తాకాల్సిన రుతుపవనాలు ఆలస్యంగా అంటే, 8వ తేదీన కేరళను తాకాయి. అక్కడి నుంచి రుతుపవనాలు విస్తరించడానికి 5 రోజుల సమయం పడుతుంది. జూన్ 12 నాటికి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని ప్రదేశాలకు నైరుతి రుతుపవనాలు ఎంటర్ అయ్యాయి.(Telangana)
కానీ, తెలంగాణలో ఇంకా ప్రవేశించలేదు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే జూన్ 15న లేదా 18న దక్షిణ తెలంగాణలోకి రుతుపవనాలు వచ్చే అవకాశం ముందని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో పశ్చిమ దిశ, ఉత్తర దిశ నుంచి గాలులు వీస్తున్నాయని, ఆ కారణంగా ఇంకా ఎండలు మండుతున్నాయని వివరించారు. ఇదే హీట్ వేవ్ కండీషన్స్ కు దారితీస్తుందని, వడగాల్పులు ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.
2020లోనే ఇదే విధంగా అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు కనిపించాయన్నారు. రుతుపవనాల్లో కదలిక మందగించడానికి తుపాను కూడా ఓ కారణం అన్నారు. తుపాను తీరాన్ని తాకిన తర్వాత రుతుపవనాల్లో కదలిక మొదలవుతుందన్నారు. రుతుపవనాలు రాక ఆలస్యం అయినప్పటికీ.. ఒక్కసారి అవి ఎంటర్ అయ్యాక వాతావరణ పరిస్థితుల్లో మార్పు వస్తుందని.. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారి పేర్కొన్నారు.
Also Read..Minister Roja: ఇంకా ఆస్పత్రిలోనే మంత్రి రోజా.. కొనసాగుతున్న చికిత్స..