Telangana: అసెంబ్లీలో బీఆర్‌ఎస్ దూకుడు.. డిఫెన్స్‌లో అధికారపక్షం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత దాదాపు పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్.. మూడో శాసనసభలో ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తోంది.

telangana assembly winter session 2023 brs party attack on congress
Telangana assembly winter session 2023: తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన బీఆర్‌ఎస్.. అసెంబ్లీలో దూకుడు మంత్రాన్ని జపిస్తోంది. శాసనసభలో అధికార కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలకు వివరణ ఇస్తూనే.. వారి మాటలకు బ్రేకులు వేసేలా పావులు కదుపుతోంది. తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్‌లో పడేయడంలో విజయవంతం అయ్యారన్న చర్చ గులాబీ పార్టీలో మొదలైంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత దాదాపు పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్.. మూడో శాసనసభలో ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీకి దీటుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ తన గళాన్ని వినిపిస్తోంది. తొలి సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చలో అధికార పార్టీని ఆత్మరక్షణలో పడేసేలా వ్యవహరించింది గులాబీ పార్టీ. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్‌రెడ్డి అన్నీ తానై వ్యవహరించగా.. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు అధికారపక్షం లేవనెత్తిన అంశాలపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.
శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనపై ఆరోపణలు చేయడంతో పాటు.. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారంటూ మండిపడ్డారు. దీన్ని అవకాశంగా మలచుకున్న బీఆర్‌ఎస్.. 50 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలన ఎలా జరిగిందో ప్రజలకు తెలియసే ప్రయత్నం చేసింది. బీఆర్‌ఎస్ కుటుంబ పాలన అంశాన్ని హస్తం పార్టీ తెరపైకి తెస్తే.. కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలపై గులాబీ పార్టీ విమర్శలు గుప్పించింది.
మేనేజ్ మేంట్ కోటాలో ప్రజాప్రతినిధిగా వచ్చారంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పేమెంట్ కేటగిరీలో కాంగ్రెస్ పార్టీలో చేరి పీసీసీ పదవి దక్కించుకున్న రేవంత్‌రెడ్డిపై ఆ పార్టీకి చెందిన నేతలు చేసిన వ్యాఖ్యలు గుర్తుకు తెచ్చుకోవాలంటూ చురకలంటించారు. తొలి విడత సమావేశాల్లోనే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఢీ అంటే ఢీ అనే విధంగా మాటల తూటాలు పేలడం రాజకీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ ప్రసంగం అనంతరం బీఆర్ఎస్ సభ్యులకు మాట్లాడే అవకాశం దక్కకపోవడంతో.. అధికార పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు గులాబీ నేతలు.
Also Read: 3 నిమిషాల్లో 3 సార్లు మైక్ కట్ చేశారు: హరీశ్ రావు
మరో రెండు మూడు రోజులు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్ అంశాలపై అధికార పార్టీ లేవనెత్తే అంశాలకు దీటుగా కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది గులాబీ దళం.