TGSRTC: ఎంజీబీఎస్ బస్టాండ్‌కు రావొద్దు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇవే.. ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ కీలక సూచన
TGSRTC MGBS bus station : ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి బస్సుల రాకపోకలను టీజీఎస్ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసింది.

TGSRTC MGBS bus station
TGSRTC MGBS bus station : హైదరాబాద్‌లో కుండపోత వర్షం కారణంగా మూసీ ఉగ్రరూపందాల్చింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత మూసీ నది ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో చాదర్‌ఘాట్ లోలెవల్ వంతెనపై నుంచి ఆరు అడుగుల మేర, మూసారాంబాగ్ వంతెనపై నుంచి 10 అడుగుల మేర వరద ప్రవహించింది. దీంతో ఎంజీబీఎస్ బస్టాండ్‌కు వెళ్లే రెండు బ్రిడ్జిలు నీట మునిగాయి. బస్టాండ్‌లోకి మూసీ వరద చేరడంతో వందల మంది ప్రయాణికులు బస్టాండ్‌లో చిక్కుకుపోయారు. దీంతో అధికారులు రంగంలోకిదిగి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. బస్టాండ్ ను తాత్కాలికంగా మూసివేశారు. ఈ క్రమంలో ఆర్టీసీ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ కీలక సూచనలు చేసింది.
మూసీ నదికి భారీ వరద నేపథ్యంలో ఎంబీజీఎస్ ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. దీంతో ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి బస్సుల రాకపోకలను టీజీఎస్ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఎంబీజీఎస్ నుంచి బయలుదేరే బస్సులను హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి సంస్థ నడుపుతోంది. మూసీ వరదనీరు చేరిన నేపథ్యంలో ఎంజీబీఎస్‌కు ప్రయాణికులు ఎవరూ రావొద్దని టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది.
ఎంబీజీఎస్ నుంచి నడిచే బస్సులను ఇతర ప్రాంతాల నుంచి తిప్పుతున్నామని, ఆయా మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రయాణికులకు సూచించారు. వివరాలకు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలని సూచించారు.
బస్సులు రూట్లు ఇవే..
♦ ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వెళ్లే సర్వీసులు జేబీఎస్ నుంచి నడుస్తున్నాయి.
♦ వరంగల్, హన్మకొండ వైపునకు వెళ్లేవి ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి వెళ్తున్నాయి.
♦ సూర్యాపేట, నల్లగొండ, విజయవాడ వైపునకు బస్సులు ఎల్బీనగర్ నుంచి నడుస్తున్నాయి.
♦ మహబూబ్‌నగర్, కర్నూల్, బెంగళూరు వైపునకు వెళ్లే సర్వీసులు ఆరాంఘర్ నుంచి వెళ్తున్నాయి.