హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై రాకపోకలు బంద్

  • Published By: naveen ,Published On : October 14, 2020 / 12:31 PM IST
హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై రాకపోకలు బంద్

Updated On : October 14, 2020 / 12:39 PM IST

hyderabad bengaluru national highway: హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారి మొత్తం ప్యాకప్ అయిపోయింది. హైవేపై తీవ్రస్థాయిలో వరదనీరు ప్రవహిస్తోంది. భారీగా పోటెత్తుతున్న వరదతో వాహనాలు ముందుకెళ్లలేని పరిస్థితి. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై రాకపోకలు బంద్ అయ్యాయి. వరద ఉధృతికి పలుచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. శంషాబాద్‌ ఏరియా చాలా వరకు జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది.

భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. శంషాబాద్ గగన్‌పహాడ్ దగ్గర అప్పచెరువు తెగిపోవడంతో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే జాతీయ రహదారి పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది.

ఈ సమయంలో అక్కడ ప్రయాణిస్తున్న పలు కార్లు కూడా ధ్వంసమైనట్లు సమాచారం. ప్రజలు అధికారులకు సహకరించాలని, అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి ఎవరూ బయటకురావద్దని సీపీ సజ్జనార్ కోరారు. ఎయిర్ పోర్టుకు, కర్నూలు వైపు వెళ్లే వారు ఓఆర్ఆర్ ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.

హైదరాబాద్‌ దిల్‌షుఖ్‌నగర్‌లో ఎటు చూసినా వరద నీళ్లే. సరూర్‌నగర్‌ చెరువు పొంగి ప్రవహిస్తుండడంతో దిల్‌షుఖ్‌నగర్‌కు వరద పోటెత్తింది. దీంతో ఆ ప్రాంతమంతా చెరువును తలపిస్తోంది. సాయిబాబా టెంపుల్ ఎదురుగా భూమి కుంగిపోవడంతో అందులో ఆర్టీసీ బస్సు ఒరిగిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ స్థంభించిపోయింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరోవైపు విజయవాడ నుంచి వస్తున్న బస్సులు, ఇతర వాహనాలు ఎల్బీనగర్‌కే పరిమితం చేశారు. వరద సహాయక చర్యలకు మాన్సూన్ ఎమర్జెన్సీ, డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు విఙ్ఞప్తి చేస్తున్నాయి.

మరో రెండు రోజులు వర్షాలు:
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగర వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పాతబస్తీలో భారీ వర్షాలకు ఇల్లు కూలి 9మంది మృతి చెందారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కనీసం మూడు రోజులు నగరంలోని ప్రజలు బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై అబ్దుల్లాపూర్‌ మెట్‌ దగ్గర భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో రెండు రోజులు సెలవు:
నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా ప్రభుత్వం రెండు రోజలపాటు సెలవు ప్రకటించింది. 14, 15 తేదీల్లో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలను మూసేయాలని ఆదేశించింది. అత్యవసరమైతే కానీ బయటకు రావొద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ప్రజలను కోరారు.

సాయం కోసం జీహెచ్‌ఎంసీ అత్యవసర సేవల నంబర్లు:
అత్యవసర సేవల కోసం 040 – 211111111, జీహెచ్‌ఎంసీ విపత్తు నిర్వహణ శాఖ – 90001 13667, 97046 01866, జీహెచ్‌ఎంసీ పరిధిలో చెట్లు తొలగించే సిబ్బంది కోసం 63090 62583, జీహెచ్‌ఎంసీ విద్యుత్‌ శాఖ- 94408 13750, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సేవల కోసం 83330 68536, 040 2955 5500 నెంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.