Who Will Lead BRS? కేసీఆర్‌ రంగంలోకి దిగే సమయం వచ్చేసిందా..? కారు స్టీరింగ్‌ను తీసుకునే చేతులేవి..

కేటీఆర్‌ అరెస్ట్ అయితే అనే ఆలోచనే.. గులాబీ శ్రేణులకు నిద్రలేకుండా చేస్తోంది. అన్నీ తానై, అన్నింటికి తానై కారును ముందుకు నడిపిస్తున కేటీఆర్ అరెస్ట్ అయితే.. పార్టీ వ్యవహారాలు చూసుకునేది ఎవరు..?

Who Will Lead BRS? కేసీఆర్‌ రంగంలోకి దిగే సమయం వచ్చేసిందా..? కారు స్టీరింగ్‌ను తీసుకునే చేతులేవి..

Who will Lead the BRS?

Updated On : January 8, 2025 / 4:05 PM IST

Who Will Lead BRS Party? ఫార్ములా ఈ-రేసు కేసులో దారులన్నీ మూసుకుపోతున్న పరిస్థితి. కేటీఆర్ అరెస్ట్ ఖాయమని.. బీఆర్ఎస్‌ శ్రేణులు కూడా ఓ అంచనాకు వచ్చినట్లు కనిపిస్తున్నాయ్. ఇదే ఇప్పుడు గులాబీ శ్రేణులకు కొత్త టెన్షన్ పుట్టిస్తోంది. కేటీఆర్‌ అరెస్ట్ అయితే అనే ఆలోచనే.. వారికి నిద్రలేకుండా చేస్తోంది. అన్నీ తానై, అన్నింటికి తానై కారును ముందుకు నడిపిస్తున కేటీఆర్ అరెస్ట్ అయితే.. పార్టీ వ్యవహారాలు చూసుకునేది ఎవరు.. స్థానిక సంస్థల ఎన్నికల ముందు జరుగుతున్న ఈ పరిణామాలు.. పార్టీలో మిగిల్చిన చర్చ ఏంటి..

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత… బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్‌గా పావులు కదులుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. వివాదం ఏదైనా కేటీఆర్‌ పేరే ప్రధానంగా వినిపిస్తున్నట్లు కనిపిస్తోంది సీన్. దాదాపు ఆరుసార్లు కేటీఆర్‌ను టార్గెట్ చేసుకొని.. సర్కార్ పావులు కదిపిందనే ప్రచారం జరుగుతోంది కూడా ! గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తూ.. ప్రభుత్వం విచారణ కమిటీలు వేసింది. దీంతో సరికొత్త అంశాలు.. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయ్‌.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రచ్చ

మొదట్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయాల్లో రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ వ్యవహారంలో కేటీఆర్‌ సూత్రధారిగానే అధికారులు పనిచేశారనే ప్రచారం జరిగింది. కేటీఆర్‌ను ఈ కేసులో కావాలని ఇరికిస్తున్నారని.. ఓ దశలో గులాబీ శ్రేణులు ఘాటుగా రియాక్ట్ అయ్యాయ్. ఆ తర్వాత లగచర్ల ఘటన.. రాష్ట్ర రాజకీయాల్లోనే కొత్త చర్చకు దారి తీసింది. సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో.. భూసేకరణ విషయంలో గిరిజన రైతులు అధికారులపై దాడి వెనక కేటీఆర్ కుట్ర ఉందనే అభియోగాన్ని.. పోలీసులు మోపే యత్నం చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.

రాజకీయాన్ని షేక్‌ చేసిన ఫామ్‌హౌస్‌ పార్టీ వ్యవహారం

ఫోన్‌ట్యాపింగ్, లగచర్ల ఘటన తర్వాత.. తెలంగాణ రాజకీయాన్ని ఫామ్‌హౌస్‌ పార్టీ వ్యవహారం షేక్ చేసింది. కేటీఆర్ బావమరిది రాజ పాకాల నివాసంలో.. డ్రగ్స్ పార్టీ జరుగుతుందని దాడులు చేసిన పోలీసులు.. ఆ కేసులో కేటీఆర్‌ను ఇరికించే ప్రయత్నం చేశారని.. బీఆర్ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇప్పుడు ఫార్ములా ఈ-కార్ రేస్ వ్యవహారం వివాదం పీక్స్‌కు చేరింది. దాదాపు నాలుగు నెలలుగా రాష్ట్ర రాజకీయాల్లో ఇది చర్చకు దారితీస్తోంది. ఈ కేసులో కేటీఆర్‌ను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గులాబీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఐతే ఇప్పుడు ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేటీఆర్ క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఏసీబీ వాదనతోనే న్యాయస్థానం ఏకీభవించినట్లు కనిపిస్తోంది.

ఏసీబీతో పాటు ఈడీ కూడా నోటీసులు ఇవ్వడంతో.. ఈసారి కేటీఆర్ అరెస్ట్ ఖాయం అనే ప్రచారం ఊపందుకుంది. పార్టీలో ఇదే ఇప్పుడు కొత్త టెన్షన్‌కు కారణం అవుతోంది. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే.. బీఆర్ఎస్‌ను ఎవరు ముందుకు నడిపిస్తారనేది చర్చకు దారి తీస్తోంది.

కేసీఆర్‌ ప్రజాక్షేత్రంలోకి రాకపోయినా…

2023 ఎన్నికల్లో ఓటమి తర్వాత.. లోక్‌సభ ఎన్నికల సమయంలో తప్పిస్తే.. కేసీఆర్ పెద్దగా బయట కనిపించలేదు. ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయడం నుంచి.. పార్టీని నడిపించడం వరకు.. అన్ని విషయాల్లోనూ కేటీఆర్‌ ముందు కనిపిస్తున్నారు. ఒకరకంగా ఆయనే అన్ని బాధ్యతలు తీసుకున్నారు. ఏడాదికాలంగా కేసీఆర్‌ ప్రజాక్షేత్రంలోకి రాకపోయినా…. నేతలకు పెద్దగా అందుబాటులో లేకపోయినా.. ఆ లోటు ఎక్కడా కనిపించకుండా కేటీఆర్.. అన్ని బాధ్యతలు నెరవేరుస్తున్నారు.

పార్టీ నేతలతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ.. అధినేత పాత్ర పోషిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం.. కొన్ని రోజులుగా పార్టీ కేడర్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ జైలుకు వెళ్తే.. కారు పార్టీని నడిపించేది ఎవరు.. కారు స్టీరింగ్‌ను తీసుకునే చేతులేవి అంటూ పార్టీ నేతల్లో కొత్త చర్చకు దారి తీస్తోంది.

ఇక అటు ఈ కేసు విషయంలో తగ్గేదే లే అన్నట్లు ఏసీబీ కనిపిస్తోంది. ఇన్నిరోజులు నాట్‌ టు అరెస్ట్ అని.. కోర్డు ఆర్డర్‌ అడ్డంకిగా ఉండేది. ఐతే ఇప్పుడు దాన్ని కూడా ఎత్తివేసింది న్యాయస్థానం. దీంతో ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ మరింత దూకుడు చూపించే అవకాశం ఉంటుంది.

కేసీఆర్‌ రంగంలోకి దిగే సమయం వచ్చేసిందా..?

కేటీఆర్‌ను విచారించేందుకు.. ప్రభుత్వం పగడ్బందీగా అడుగులు వేస్తోంది. గవర్నర్ అనుమతి తీసుకోవడంతో పాటు కేసును ఏసీబీకి అప్పగించడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా కేసులో ఎంటర్ అయింది. దీంతో ఒకరకంగా ఈ కేసులో ఉచ్చు బిగుసుకుంటున్నట్లే ! అరెస్ట్ జరిగితే.. పార్టీని నడిపించేది ఎవరు అనేది ఇప్పుడు మిలియన్ డాలర్‌ ప్రశ్నగా మారింది. కేసీఆర్‌ రంగంలోకి దిగే సమయం, సందర్భం ఆసన్నమైందని కొందరు అంటుంటే.. నాయకత్వం విషయంలో మరికొందరు పేర్లు తెరమీదకు వస్తున్నాయ్. ఐతే ఏం జరుగుతుందనేది మాత్రం జనవరి 9 తర్వాతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఏమైనా ఫార్ములా ఈ-రేసు కేసు వ్యవహారం.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరతీయడం ఖాయమంటూ మరికొందరు అంటున్నారు.