YS Sharmila: బీజేపీకి సవాల్ చేస్తున్న.. మీరు నిజాయితీ పరులైతే వాటిపై సీబీఐ విచారణకు ఆదేశించండి
మరోసారి కేసీఆర్ అధికారంలోకి వస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, తెలంగాణ దొంగలకు ఓట్లు వేయొద్దని ప్రజలకు షర్మిల విజ్ఞప్తి చేశారు.

YSRTP Chief Sharmila,
YSRTP Chief YS Sharmila: తెలంగాణ సీఎం కేసీఆర్ అపర మేధావిలాగా ఫీల్ అవుతారని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వై.ఎస్. షర్మిల విమర్శించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాజశేఖర్ రెడ్డి బ్రతికున్న రోజుల్లో అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కు రూపాకల్పన చేశారని, కేసీఆర్ 2014 లో ముఖ్యమంత్రి అయ్యాక అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ రీడిజైన్ చేశారని అన్నారు. ఆయన అనవసరం అయినా పనులు అన్ని చేస్తాడని, కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ కోసం రూపకల్పన చేశారని విమర్శించారు. తెలంగాణలో కట్టిన ప్రాజెక్ట్ లు కుక్కతోక తగిలితే కూలిపోయే పరిస్థితి ఉందని అన్నారు. 40వేల కోట్ల ప్రాజెక్ట్ లక్ష 20వేల కోట్లు చేసి పెద్ద అవినీతికి కేసీఆర్ తెరలేపారని షర్మిల ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీబీఐకు ఫిర్యాదు కూడా చేశామని చెప్పారు. దేశానికి సంబంధించిన డబ్బు.. కాళేశ్వరంలో పెట్టిన కోట్ల రూపాయల డబ్బు అని, ఆ డబ్బులు ఎలా ఖర్చు అవుతుందో కాపలా ఉండాల్సిన బాధ్యత కేంద్రం పెద్దలకు లేదా అని షర్మిల ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నడపడానికి వచ్చే విద్యుత్ బిల్లు అక్షరాలా 7వేల కోట్లు పైచిలుకని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజల పట్ల కేసీఆర్ కు, బీజేపీ కి చిత్తశుద్ది లేదని, ఆ రెండు పార్టీలు తోడు దొంగలని షర్మిల విమర్శించారు.
బీఆర్ఎస్ కు ఎంఐఎం బహిరంగంగానే మద్దతు ఇస్తుంటే బీజేపీ ఏం చేస్తుందని షర్మిల ప్రశ్నించారు. బీజేపీ దర్యాప్తు సంస్థలతో ఇష్టం వచ్చినట్లు దాడులు చేయిస్తుంది.. కానీ, కాళేశ్వరం విషయంలో గుడ్డిగా వ్యవహరిస్తుందని, కేసీఆర్ ను బీజేపీ కంటికి రెప్పలా కాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి సవాల్ చేస్తున్న.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటికాకపోతే, మీరు నిజాయితీ కలిగిన నాయకులైతే వెంటనే కాళేశ్వరంపై, మెగా కృష్ణ రెడ్డిమీద సీబీఐ ఎంక్వయిరీ వేయాలని షర్మిల డిమాండ్ చేశారు. మరోసారి కేసీఆర్ అధికారంలోకి వస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, తెలంగాణ దొంగలకు ఓట్లు వేయొద్దని ప్రజలకు షర్మిల విజ్ఞప్తి చేశారు.