Chandrababu: ఏపీ పాలిటిక్స్‌ను మలుపు తిప్పిన ఐటీ నోటీసులు.. చంద్రబాబు మౌనం వ్యూహాత్మకమా?

ఏపీ పాలిటిక్స్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది ఆదాయపు పన్నుశాఖ. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు 153C నోటీసు జారీ చేయడం రాజకీయ సంచలనానికి దారితీస్తోంది.

Chandrababu: ఏపీ పాలిటిక్స్‌ను మలుపు తిప్పిన ఐటీ నోటీసులు.. చంద్రబాబు మౌనం వ్యూహాత్మకమా?

TDP Chief Chandrababu Naidu not respond to IT Notice

Chandrababu Naidu: చంద్రబాబు దొరికిపోయారా? అధికార వైసీపీకి (YSR Congress Party) అస్త్రం ఇచ్చారా? 118 కోట్ల రూపాయల లెక్కల్లో చూపని ఆదాయంపై ఆదాయపు పన్ను శాఖ (Income Tax) జారీ చేసిన నోటీసులపై టీడీపీ ఎందుకు స్పందించడం లేదు. ఎన్నికల సమయంలో చంద్రబాబును టార్గెట్ చేయడానికే ఐటీని తెరపైకి తెస్తున్నారా? చంద్రబాబు-ఐటీ-వైసీపీ ట్రైయాంగిల్ ఫైట్‌లో ఎవరి వ్యూహమేంటి? రాజకీయ కోణమేంటి? తెరవెనుక ఏం జరుగుతోంది?

ఏపీ పాలిటిక్స్‌ను (AP Politics) ఒక్కసారిగా మలుపు తిప్పింది ఆదాయపు పన్నుశాఖ. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు 153C నోటీసు జారీ చేయడం రాజకీయ సంచలనానికి దారితీస్తోంది. గత నెలలోనే ఈ నోటీసులు జారీ చేసినా.. ఆలస్యంగా వెలుగు చూడటం.. ఈ నోటీసులపై తెలుగుదేశం పార్టీ స్పందించేందుకు ఆసక్తి చూపకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఎక్కడో తేడా జరిగిందనే సందేహాలకు ఊతమిస్తోంది. తాను కడిగిన ముత్యమని.. తాను తప్పుచేస్తే నిరూపించాలని ధైర్యంగా ప్రకటించే టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఇంతవరకు ఐటీ నోటీసులపై స్పందించకపోవడం.. తమ ఆడిటర్లే ఆ విషయాలను చూసుకుంటారని తేలిగ్గా తీసుకుంటుండటం విస్తృత చర్చకు దారితీస్తోంది.

చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇవ్వడాన్ని వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. రాజధాని అమరావతి నిర్మాణంలో అవినీతి జరిగిందనే తమ ఆరోపణలకు ఊతం లభించిందని సంబరపడిపోతోంది వైసీపీ. షాపూర్జీ పల్లోంజి, ఎల్‌ అండ్ టీ కంపెనీల నుంచి సబ్ కాంట్రాక్టులు తీసుకున్న సంస్థలు 118 కోట్ల రూపాయలను చంద్రబాబుకు చెల్లించినట్లు ఆరోపిస్తోంది ఆదాయపు పన్నుశాఖ. తమ విచారణలోనూ.. తనిఖీల్లోను తమ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు లభించినట్లు చంద్రబాబుకు ఇచ్చిన నోటీసుల్లో స్పష్టం చేసింది. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ద్వారా ఈ వ్యవహారం నడిచినట్లు.. మనోజ్ వాసుదేవ్ పార్థసాని అనే వ్యక్తి చెప్పినట్లు వెల్లడించింది ఐటీ శాఖ. ఈ మనోజ్ వాసుదేవ్ పార్థసాని (Manoj Vasudev Pardasany) అలియాస్ MVP ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజి అండ్ కో తరఫున ఏపీ టెండర్లలో పాల్గొనడంతో తమ ఆరోపణలను తీవ్రం చేస్తోంది వైసీపీ.

Also Read: రెండు ఎకరాల చంద్రబాబు రెండు వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు : మంత్రి రోజా

రాజకీయంగా ఏ వ్యవహారంపైనైనా చాలా క్లారిటీగా ఉండే చంద్రబాబు అండ్ టీం ఈ విషయాన్ని చాలా లైట్‌గా తీసుకోవడంపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. గత ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం మారిన నుంచి వైసీపీ నేతలు అనేక ఆరోపణలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపై విచారణలు జరిపించారు. కానీ ఎక్కడా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో బాబుపై ఏ చర్య తీసుకోలేకపోయింది వైసీపీ ప్రభుత్వం. కానీ, తన అనుమానాలకు బలం చేకూర్చే అనేక మార్గాలను అన్వేషించింది.

Also Read: దుబాయ్ లో చంద్రబాబు ముడుపులు తీసుకున్నారు.. అమరావతి అనేది పెద్ద భూ దందా : అనిల్ కుమార్

తాజాగా చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన ఐటీ శాఖ దగ్గర నుంచి కొన్ని సాక్ష్యాలు సేకరించే పనిచేసింది. ఐతే 2019లో పార్థసాని అసోసియేట్స్‌లో తనిఖీలు జరిపిన ఐటీశాఖ.. చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ను గతంలో విచారించింది. ఆ సమయంలోనే లెక్కల్లో చూపని ఆదాయంగా పేర్కొంటూ 118 కోట్ల ముడుపుల లెక్క తేల్చాలంటూ నోటీసు ఇచ్చింది ఆదాయపు పన్నుశాఖ. ఐతే ఆ నోటీసులకు ఆధారాలు లేవని అప్పట్లోనే సమాధానం ఇచ్చింది టీడీపీ. కానీ, అవే ఆరోపణలకు ఇప్పుడు MVP వాంగ్మూలం కోట్ చేస్తూ మళ్లీ నోటీసులు జారీ చేయడమే హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంలో టీడీపీ, చంద్రబాబు అండ్ టీం సైలెంట్‌గా ఉండటం ఉత్కంఠ రేపుతోంది. వైసీపీ విమర్శలు దాడి తీవ్రం చేస్తున్నా చంద్రబాబు బృందం మౌనంగా ఉండటం వ్యూహాత్మకమా? లేక సమయం కోసం ఎదురుచూస్తున్నారా? అనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు.