స్వరూపానందేంద్ర స్వామిని అడ్డగించిన అమరావతి రైతులు

మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ 52రోజులుగా ఆందోళనలు చేస్తున్న రైతులకు సంఘీభావంగా అనేక చోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా గుంటూరులో స్వరూపానందేంద్ర స్వామికి అమరావతి సెగ తగిలింది. అమరావతికి మద్దతుగా స్వరూపానందేంద్ర స్వామి ప్రకటన చెయ్యాలంటూ మహిళా రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జై అమరావతి అంటూ స్వరూపానందేంద్ర ఎదుట నినాదాలు చేశారు.
శుక్రవారం(07 ఫిబ్రవరి 2020) ఉదయం గోరంట్ల వెంకటేశ్వరస్వామి ఆలయం దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే శిష్యుల సాయంతో అక్కడి నుంచి స్వరూపానందేంద్ర స్వామి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అమరావతి కోసం రాజధాని రైతులు చేపట్టిన ఆందోళనలు నేటికి 52వ రోజుకి చేరుకున్నాయి. రాజధాని గ్రామాల్లో ప్రజలు ఇంకా వారి నిరసనలు కొనసాగిస్తూ ఉన్నారు.
తుళ్లూరు, మందడం, వెలగపూడి, ఉద్దండరాయునిపాలెం, నవులూరు, పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, నిడమర్రు తదితర గ్రామాల్లో రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. వెలగపూడిలో 52వ రోజు రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. మందడం, వెలగపూడిలో రైతులు 24 గంటల దీక్షలను కొనసాగిస్తున్నారు. కృష్ణాయపాలెం, ఎర్రబాలెం గ్రామాల్లో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.