వైఎస్ఆర్ రైతు భరోసా.. నేరుగా అకౌంట్లోకి డబ్బులు: జగన్ చేతుల మీదుగా ప్రారంభం

‘వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ సమ్మాన్ యోజన’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ(15 అక్టోబర్ 2019) ప్రారంభిస్తున్నారు. ఈ పథకం కింద ప్రతీ ఏటా రైతుకు రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 అందించనుంది ప్రభుత్వం.
ఇందులో కేంద్రం రూ. 6వేలు ఇస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ. 7500 ఇస్తుంది. వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించిన కార్యక్రమం నెల్లూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీ ప్రాంగణంలో జరగనుంది.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం అక్కడి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతులు, కౌలుదారుల కుటుంబాల పేరిట బ్యాంకు అకౌంట్లలో నేరుగా పెట్టుబడి సాయం పడనుంది.
ఇప్పటికే 40 లక్షల మంది రైతులు, కౌలు రైతుల కుటుంబాలు ఇందుకు అర్హులుగా ప్రభుత్వం చెబుతుంది. సరళీకరించిన నిబంధనల ప్రకారం మరో 14 లక్షల మంది వరకు లబ్ధిదారుల జాబితాలో చేరవచ్చు. మిగిలిన జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు చెక్కులను పంపిణీ చేస్తారు.
రైతు భరోసా పథకం కింద మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. మే నెలలో రూ.7500, అక్టోబర్ నెలలో రూ.4000, సంక్రాంతి సమయంలో రూ.2000 ఇవ్వనున్నారు.
ఈ పథకం కింద మొత్తం 54 లక్షల మంది రైతులు లబ్ధి పొందే అవకాశం ఉంది. ఇప్పటికప్పుడు 40 లక్షల మందికి పథకం కింద లబ్ది చేకూరుతుండగా.. అర్హత ఉన్న రైతులు నవంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకునే వీలు ఉంది.