వివేకా హత్య కేసుపై మాట్లాడొద్దు : సిట్ కు హైకోర్టు ఆదేశం

  • Published By: veegamteam ,Published On : March 26, 2019 / 10:39 AM IST
వివేకా హత్య కేసుపై మాట్లాడొద్దు : సిట్ కు హైకోర్టు ఆదేశం

Updated On : March 26, 2019 / 10:39 AM IST

మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ చేస్తున్న సిట్ కు కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా దర్యాప్తు సాగాలని ఆదేశించింది. ఏపీ హైకోర్టులో దాఖలైన మూడు పిటిషన్లపై విచారణ చేసిన ఏపీ హైకోర్టు ఈ విధంగా ఆదేశాలిచ్చింది. ముఖ్యంగా.. ఎన్నికలు ముగిసే వరకు విచారణ వివరాలను, దర్యాప్తు తీరును మీడియాకు వెల్లడించకూడదని.. ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టరాదని సిట్ ను ఆదేశించింది కోర్టు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్, వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ, రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అనిల్‌ ఈ పిటిషన్లను దాఖలు చేశారు. హత్య కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్లను మార్చి 26 మంగళవారం ఏపీ హైకోర్టు విచారించింది.

సిట్‌ విచారణపై నమ్మకం లేదని థర్డ్‌పార్టీ సంస్థతో విచారణ చేయించాలని పిటిషన్‌దారుల తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఎన్నికల ముందు సిట్‌ దర్యాప్తు పేరిట మీడియా సమావేశాలు నిర్వహించి వైఎస్‌ కుటుంబ సభ్యులను బద్నాం చేయాలని చూస్తున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికలు ముగిసే వరకు సిట్‌ ఎలాంటి ప్రెస్‌మీట్‌ పెట్టకుండా నిరోధించాలని కోర్టుకు విన్నవించారు. ఆయన వాదనతో ఏకీభవించిన హైకోర్టు ఎన్నికలు ముగిసేవరకు సిట్‌ మీడియా సమావేశాలు నిర్వహించొద్దని ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణ జరుపుకోవచ్చని తెలిపింది.