గెలుపెవరిది : ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం(మార్చి 26, 2019) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తెలంగాణలో 2 ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి.. ఏపీలో (కృష్ణా, గుంటూరు) ఒక ఉపాధ్యాయ, 2 పట్టభద్రుల నియోజకవర్గాలకు మార్చి 22న ఎన్నికలు జరిగాయి. రాత్రి వరకు ఫలితాలు వెలువడే అవకాశముంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. 20వేల 888 ఓట్లకు గాను 18వేల 886 ఓట్లు పోలయ్యాయి.
కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో ఏర్పాట్లు చేశారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ టీచర్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు నల్గొండ శివారులోని దుప్పలపల్లి హౌసింగ్ గోదాములో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోని పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల లెక్కింపునకు కరీంనగర్‌లోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు చేశారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 19వేల 376 ఓట్లు పోలవగా… పట్టభద్రుల ఎమ్మెల్సీకి లక్షా 16వేల 156 ఓట్లు పోలయ్యాయి. ఒక్కో స్థానానికి 14 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో ప్రతిరౌండ్‌లో వెయ్యి ఓట్లను లెక్కించనుండగా… పట్టభద్రుల కౌంటింగ్‌లో ఒక్కో రౌండ్‌కు 14వేల ఓట్లను లెక్కించనున్నారు. పోలింగ్‌ను బ్యాలెట్ పేపర్లతో నిర్వహించడంతో ఫలితాల వెల్లడి ఆలస్యం కానుంది.
ప్రిలిమినరీ రౌండ్లలో ఫలితం తేలకుంటే సబ్ పార్సిల్ పద్ధతిలో ఓట్లను లెక్కించనున్నారు. ఫలితం తేలడం ఆలస్యమైతే రెండో షిఫ్టులో విధులు నిర్వహించేందుకు అదనపు సిబ్బందిని రెడీగా ఉంచారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మెదక్,నిజామాబాద్,ఆదిలాబాద్,కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 17 మంది, మెదక్,నిజామాబాద్,ఆదిలాబాద్,-కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఏడుగురు, వరంగల్,ఖమ్మం,నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి 9 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.