Cyclone Montha: ముంచుకొస్తున్న మహా ముప్పు.. ఏపీలో అత్యంత భారీ వర్షాలు.. ఈ 7 జిల్లాలకు రెడ్ అలర్ట్..
ఈ ప్రాంతంలో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Cyclone Montha: మొంథా తుపాను ముప్పు ముంచుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం.. పశ్చిమ దిశగా కదిలి వాయుగుండంగా మారింది. రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ఎల్లుండి ఉదయానికి తుపాను తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ఈ తుపాను మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. అయితే తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయి.
మొంథా తుపాను ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో రేపు రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఈ ప్రాంతంలో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మరో 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయంది. ఇక శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఇది రాబోయే 12 గంటల్లో మొంథా తుపానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ తుపాను ఎల్లుండి సాయంత్రం లేదా రాత్రి సమయంలో మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, గరిష్టంగా గాలి వేగం 110 కిలోమీటర్లకు చేరుకోవచ్చని హెచ్చరించారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రేపటి నుంచి మూడు రోజులు అన్ని కార్గో ఎగుమతి, దిగుమతులను నిలిపివేయాలని నిర్ణయించారు.
